తెలంగాణ ఉద్యోగుల మెడపై కత్తి: కేసీఆర్

తెలంగాణ ఉద్యోగుల మెడపై కత్తి: కేసీఆర్

 

తెలంగాణ ఉద్యోగుల మెడపై కత్తి లాంటి జీవో నంబర్ 177ను సీఎం తక్షణం ఉపసంహరించాలి. ఈ జీవో రాజ్యాంగ విరుద్ధం. ఈ జీవో తెలంగాణ ఉద్యోగుల మెడపై కత్తి పెట్టడమే. ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యోగులంతా ఇటీవల చేసిన 15 రోజులు సమ్మె వంటి వాటి నిరోధానికే ఈ జీవో తెచ్చారు. దీనికి మంత్రివర్గ ఆమోదముందా? తెలంగాణ మంత్రులు ఒప్పుకున్నారా? మే, జూన్ నెలల్లో తెలంగాణ వస్తుందంటున్న తెలంగాణ మంత్రులకు నా సవాల్! సీఎం ముక్కు పిండి జీవోను రద్దు చేయించండి. లేదంటే రాజీనామా చేయండి. తెలంగాణ ఎమ్మెల్యేలు కూడా జీవోను రద్దు చేయించాలి. లేదంటే రాజీనామా చేయాలి.

తక్షణం రద్దు చేయాలి: ప్రభుత్వోద్యోగుల హక్కులను హరించేందుకు ఉద్దేశించిన జీవో 177ను తక్షణం రద్దు చేయాలి. ఉద్యోగులకు ఏ ఇబ్బంది వ చ్చినా ఆదుకుంటామన్న హామీని కాంగ్రెస్ నేతలు నిలబెట్టుకోవాలి. - బీజేపీ నేత రాజేశ్వరరావు

జీవోను ఉపసంహరించాలి: ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాల్సింది పోయి సర్కారే బెదిరింపులకు పాల్పడుతోంది. జీవోను తక్షణం ఉపసంహరించాలి.
- ఎమ్మెల్సీలు చుక్కా రామయ్య, ఎంవీఎస్ శర్మ

ప్రజాస్వామిక చర్య అనిపించుకోదు: ఉద్యోగులు, టీచర్ల ఆందోళనలు ఎప్పట్నుంచో ఉన్నవే. జీవో 177 ప్రజాస్వామిక చర్య అనిపించుకోదు. - ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి

ఉద్యోగ సంఘాల స్పందనలు...
ఉద్యోగుల ఆకాంక్షలకు పాతర వేసేందుకు, తెలంగాణ ఉద్యమాన్ని అణచేసేందుకే ఈ నల్ల జీవో తెచ్చారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా శుక్రవారం తెలంగాణ అంతటా కలెక్టర్, ఆర్డీవో, హెచ్‌వోడీ, మండల కార్యాలయాల ముందు నిరసన వ్యక్తం చేస్తాం.
-టీఎన్‌జీవో నేతలు స్వామి గౌడ్, దేవీ ప్రసాద్

ఇలాంటి నల్ల జీవోలతో తెలంగాణ ఉద్యమాన్ని ఆపజూడటం పాలకుల అజ్ఞానానికి నిదర్శనం. జీవోను తక్షణం ఉపసంహరించాలి. పరీక్షల తరుణంలో ప్రశాంతతను చెడగొట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
-తెలంగాణ ఇంటర్ విద్య జేఏసీ కన్వీనర్ మధుసూదన్‌రెడ్డి

ఈ నల్ల జీవోలతో ప్రభుత్వం సాధించేదేమీ లేదు. ఉద్యోగుల ఆందోళనను అణచేసే లక్ష్యంతో జారీ చేసిన ఈ జీవోను రద్దు చేయాలి. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను తక్షణం పరిష్కరించాలి. -ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి

ఈ జీవోను రద్దు చేయకుంటే పెద్ద ఎత్తున ఉద్యమించి ప్రభుత్వం మెడలు వంచుతాం. ఉద్యమాలను అణచేయాలని ప్రయత్నిస్తే వాటి స్ఫూర్తి మరింత పెరుగుతుంది.
-తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్

ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణి విడనాడాలి. జీవోను ఖండిస్తున్నాం.
-ఏపీ రెవెన్యూ సర్వీసుల సంఘం నేతలు ఆనందరావు, శివశంకర్

177 జీవో ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం. జీవోను రద్దు చేయకపోతే శుక్రవారం రాష్టవ్య్రాప్తంగా బంద్ చేపడతాం. -పీఆర్‌టీయూ నేతలు వెంకటరెడ్డి, పూల రవీందర్

నల్ల జీవోలతో ఉద్యోగుల గొంతు నొక్కే ప్రయత్నాలు ఫలించవు. తమిళనాడు మాజీ సీఎం జయలలితను ఆదర్శంగా తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆమె సర్కారుకు పట్టిన గతే పడుతుంది. ఉద్యోగుల సమ్మె హక్కును రాజ్యాంగ హక్కుగా ప్రకటించి చట్టం చేయాలి. - ఏపీటీఎఫ్ నేతలు కె.వేణుగోపాల్, షేక్ జిలానీ

గతంలోనూ ఇలాంటి జీవోలు ఇచ్చారు. ప్రభుత్వం అణచివేత ధోరణి ప్రదర్శిస్తే ఉద్యమాలు ఆగవు. - యూటీఎఫ్ నేతలు నారాయణ, వెంకటేశ్వరరావు

ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని చెప్పి మాట తప్పిన ప్రభుత్వంపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో స్పష్టం చేయాలి.
- ఎస్టీయూ నేతలు కత్తి నరసింహారెడ్డి, పున్న కుమార్

శిక్షల పేరుతో ఉద్యోగులను భయపెడితే మరిన్ని సమస్యలు తప్పవని ప్రభుత్వం గ్రహించాలి - సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలు హనుమంతరెడ్డి, మురళి

నల్ల జీవోను తక్షణం రద్దు చేయకుంటే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదు
- తెలంగాణ ఉద్యోగుల సంఘం నేత పద్మాచారి

ఉద్యోగులేమీ బానిసలు కాదు. అప్రజాస్వామిక ఆంక్షలతో నియంత్రించాలనుకోవడం ప్రభుత్వ అణచివేత ధోరణికి నిదర్శనం.
-పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయీస్ యూనియన్ ఫెడరేషన్ నేత జనార్దనరెడ్డి