ఉల్లంఘనులకు షోకాజ్

ఉల్లంఘనులకు షోకాజ్

కడప, న్యూస్‌లైన్: రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థులైన డీఎల్ రవీంద్రారెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డిలతో పాటు 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ ఎన్.తులసిరెడ్డిలకు వైఎఎస్‌ఆర్ జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ శశిభూషణ్ కుమార్ షోకాజ్‌లను జారీ చేశారు. ఈ మేరకు బుధవారం సంబంధిత అధికారుల ద్వారా వారి ముగ్గురికీ నోటీసులను అందజేశారు. ఉపఎన్నికల నేపథ్యంలో భాగంగా జిల్లాలో గతనెల 30 నుంచి ఎన్నికల కోడ్ అమలులో ఉన్న విషయం తెలిసిందే. వైఎస్ వివేకా, ఎన్.తులసిరెడ్డిలు వేంపల్లెలోని ఉర్దూఘర్ షాదీఖానాలో గత సోమవారం కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. షాదీఖానాలో కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించడంపై టీడీపీ ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. షాదీఖానాలో రాజకీయ పార్టీ సమావేశం నిబంధల పరిధిలోనిదే అయితే తనకు అనుమతి ఇవ్వాలని, లేనిపక్షంలో కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ తులసిరెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేస్తూ 48 గంటలలోపు సంజాయిషీ ఇవ్వాలని ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను తహశీల్దార్ శ్రీనివాసులు తులసిరెడ్డికి అందజేశారు. మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి రెండురోజుల కిందట ఖాజీపేటలోని ఎయిడెడ్ జూనియర్ కళాశాలలో పార్టీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించడం కోడ్ ఉల్లంఘనేనని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదులపై స్పందించిన జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి బుధవారం ఈ షోకాజ్ నోటీసులను జారీ చేశారు. మంగళవారం మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి దువ్వూరులోని రామాలయంలో పార్టీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించడంపై కూడా ఎన్నికల అధికారులకు ఫిర్యాదు అందడంతో మరో షోకాజ్ నోటీసును అందించేందుకు సిద్ధం చేసినట్లు అధికారుల సమాచారం