మంత్రులందరూ కడప గడప తొక్కనున్నారు...........చలొ కడప

మంత్రులందరూ కడప గడప తొక్కనున్నారు...........చలొ కడప



హైదరాబాద్, న్యూస్‌లైన్:ఒకే ఒక్కడు. అజేయ శక్తిగా అవతరించిన ఆ ఒక్కడిని ఎదుర్కోవడానికి మంత్రివర్గమంతా ఏకమవుతోంది. ఉప ఎన్నికల్లో యువనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌ను ఎలాగైనా నిలువరించేందుకు మంత్రులందరూ కడప గడప తొక్కనున్నారు. అసెంబ్లీ సెగ్మెంటుకు ఒకరు చొప్పున ఉప ఎన్నికలు ముగిసేదాకా ఏడుగురు సీనియర్ మంత్రులు పూర్తిస్థాయిలో అక్కడే మకాం వేస్తున్నారు. వారికి అన్నివిధాలా చేదోడువాదోడుగా ఉండేందుకు అధికార పార్టీ ఎంపీలంతా కదిలి వస్తున్నారు. అంతేకాదు... మండలాల వారీగా భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలనూ మోహరిస్తున్నారు.

కుల సమీకరణాలకు పెద్దపీట వేస్తూ, ఏ కులానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్న మండలానికి ఆ కులానికి చెందిన ప్రజాప్రతినిధులే వెళ్లేలా అధికార పార్టీ ప్రచార స్క్రిప్టు పక్కాగా రూపుదిద్దుకుంటోంది. వీరికి తోడుగా ‘మెగాస్టార్’ చిరంజీవిని తురుపుముక్కగా ప్రచారంలో దించాలని నిర్ణయించారు. ఆయనకు తోడుగా సీఎం కిరణ్, మాజీ సీఎం రోశయ్య, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ కూడా విసృ్తతంగా పర్యటిస్తారు. అసెంబ్లీ సెగ్మెంట్లకే పరిమితం కాకుండా ముఖ్య మండలాలను కూడా వారంతా కవర్ చేసేలా రూట్‌మ్యాప్ రూపొం దిస్తున్నారు. సీఎం, పీసీసీ చీఫ్ డి.శ్రీనివాస్‌ల సమక్షంలో ఆదివారం జరిగిన మంత్రుల కీలక సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. ఇన్ని చేసినా యువనేతను నిలువరించగలమని ఎవరూ ధీమా వ్యక్తం చేయకపోవడంతో... వైఎస్ సెంటిమెంటునే నమ్ముకోవాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు.

ఇందిర, రాజీవ్, సోనియాగాంధీల కంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటాలనే ప్రచారంలో వీలైనంత విసృ్తతంగా ఉపయోగించాలని తీర్మానించారు. పై స్థాయిలో ఇవన్నీ చేసినా... అసలు క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ నేతలు ఎంతవరకు సహకరిస్తారన్న అనుమానాన్ని స్వయానా సీఎం కిరణే వ్యక్తం చేశారు. అందుకే ముందుగా కాంగ్రెస్ నేతల్లో నిజంగా పార్టీ విజయం కోసం పని చేసేవారెందరో గ్రామాలవారీగా లెక్క తేల్చే ప్రయత్నం చేయాలని మంత్రులను ఆదేశించారు. మొత్తానికి కడప లోక్‌సభ విషయంలో అసెంబ్లీ ఎన్నికలను మించిన స్థాయిలో కసరత్తు జరిగిందని భేటీ అనంతరం ఒక మంత్రే వ్యాఖ్యానించారు!

సర్వశక్తులూ ఒడ్డండి: సీఎం
కడపలో జగన్‌ను నిలువరించేందుకు సర్వ శక్తులూ ఒడ్డాలని మంత్రులను సీఎం కిరణ్ ఆదేశించారు. కడప, పులివెందుల ఉప ఎన్నికలపై ఆదివారం డీఎస్ సమక్షంలో వారితో ఆయన సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. నామినేషన్ల ఘట్టం నుంచి ఓట్ల లెక్కింపు దాకా ఎవరెవరు ఏమేం చేయాలో పక్కాగా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. పులివెందుల అభ్యర్థి, వ్యవసాయ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, బొత్స సత్యనారాయణ, టీజీ వెంకటేశ్, కె.పార్థసారథి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, బసవరాజ్ సారయ్య, పసుపులేటి బాలరాజు, డీకే అరుణ, మాజీ మంత్రి షబ్బీర్ అలీ తదితరులు భేటీలో పాల్గొన్నారు. కడప లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల బాధ్యతలను ఏడుగురు సీనియర్ మంత్రులకు సీఎం ప్రత్యేకంగా అప్పగించారు. కిందిస్థాయిలో బృందాల ఏర్పాటుతో సహా ఆయా నియోజకవర్గాల్లో అన్ని వ్యవహారాలనూ వారే చూసుకోవాలని ఆదేశించారు.

కడపకు కన్నా లక్ష్మీనారాయణ, పులివెందులకు ఆనం రామనారాయణరెడ్డి, ప్రొద్దుటూరుకు టీజీ వెంకటేశ్, జమ్మలమడుగుకు బొత్స సత్యనారాయణ, బద్వేలుకు మానుగుంట మహీధర్‌రెడ్డి, కమలాపురానికి ఎన్.రఘువీరారెడ్డి, మైదుకూరుకు ధర్మాన ప్రసాదరావు ఇన్‌చార్జిలుగా నియమితులయ్యారు. వారంతా తమ అసెంబ్లీ సెగ్మెంట్లలో నామినేషన్ల ఘట్టానికి ముందే ఒకసారి విసృ్తతంగా పర్యటించి రావాలని సీఎం చెప్పారు. గ్రామాలవారీగా పరిస్థితులను అంచనా వేసి, క్షేత్రస్థాయి వ్యూహాన్ని రూపొందించుకోవాలని సూచించారు. నామినేషన్ల అనంతరం పోలింగ్ ప్రక్రియ దాకా ఏడుగురు మంత్రులూ పూర్తిస్థాయిలో నియోజకవర్గాల్లోనే ఉండేలా కార్యక్రమాలను రూపొందించుకుంటున్నారు. ఈ మంత్రులకు ఎంపీలంతా పూర్తిస్థాయిలో చేదోడువాదోడుగా నిలవాలని నిర్ణయించారు. వీరికి తోడు రాష్టవ్య్రాప్తంగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను కూడా కడప లోక్‌సభ స్థానం పరిధిలోని మండలాలకు భారీగా తరలించనున్నారు. మండలాల వారీగా వారిని రప్పించుకునే బాధ్యతను ఆయా నియోజకరవర్గాల మంత్రులకు అప్పగించారు.

కుల సమీకరణలపై సమావేశం ప్రత్యేకంగా దృష్టి సారించింది. కులాలవారీగా ప్రజాప్రతినిధులు, నేతల మోహరింపుపై సీఎం, డీఎస్‌లు చర్చించారు. మండలాల వారీగా ఏయే కులాల ఓటర్లు ఎక్కువగా ఉన్నారో ముందే అంచనా వేసుకుని, ఆ ప్రకారమే మోహరింపులు ఉండేలా వ్యూహరచన చేస్తున్నారు. వీరితో పాటు ఆయా కులాలకు చెందిన మరికొందరు ముఖ్య నేతలను కూడా కడపకు తరలిస్తారు. కడపలో బీసీల సంఖ్య ఎక్కువగా ఉన్నందున బీసీ సంక్షేమ మంత్రి సారయ్యతో పాటు మరికొందరు బీసీ మంత్రులను కూడా కడప పంపాల్సిందిగా సీఎంను వివేకా కోరినట్టు సమాచారం. ఎస్సీ, ఎస్టీల ఓట్లు సంప్రదాయబద్ధంగా కాంగ్రెస్‌వే అయినా మారిన పరిస్థితుల్లో అవి పార్టీ చేజారిపోయాయని, వాటిని తిరిగి పొందేందుకు ఆ సామాజిక వర్గాల ఎమ్మెల్యేలంతా బృందాలుగా గ్రామాల్లోనే మకాం వేసేలా చూడాలని నిర్ణయించారు. మంత్రులకు సహాయంగా వెళ్లే ఎంపీలను కూడా వారి సామాజిక నేపథ్యాల ఆధారంగానే సంబంధిత సెగ్మెంటుకు పంపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై ఎంపీలతో మరోసారి ప్రత్యేక సమావేశం నిర్వహించాలని సీఎం నిర్ణయించారు.

మంత్రులకు ఇన్‌చార్జులుగా బాధ్యతలు అప్పగించడంతోపాటు ప్రచారానికి కూడా మంత్రుల బృందాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మంత్రులు కె.పార్థసారథి, ఎరాసు ప్రతాప్‌రెడ్డి, సాకే శైలజానాథ్ ఇందులో సభ్యులు. ఇందిర, రాజీవ్, సోనియాగాంధీ చిత్రపటాలకన్నా ఎక్కువగా వైఎస్ ఫొటోలను విరివిగా వినియోగించడం ద్వారానే వైఎస్ సెంటిమెంటును ఈ ఉప ఎన్నికల్లో పార్టీకి అనుకూలంగా మలుచుకోగలమనే అభిప్రాయం చర్చలో వచ్చింది. సోనియాను జగన్ విమర్శిస్తున్నందున, ఆమెను పొగుడుతూ గతంలో వైఎస్ చేసిన ప్రసంగాల సీడీలను ఊరూరా ప్రదర్శించాలని సూచించారు. ఆజాద్, కిరణ్, మాజీ సీఎం రోశయ్య పలు దఫాలుగా ప్రచారంలో పాల్గొనేలా కార్యక్రమాలను ఖరారు చేయనున్నారు. కాంగ్రెస్‌లో విలీనమవుతున్న పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవితో విసృ్తతంగా ప్రచారం చేయించాలని నిర్ణయించారు. ఇతర పీఆర్పీ నేతలనూ ప్రచార బరిలో దించుతున్నారు. అసెంబ్లీ సెగ్మెంట్ల కేంద్రాల్లోనే కాకుండా ముఖ్యమైన మండల కేంద్రాల్లో కూడా వీరి ప్రచారాలు సాగేలా రూట్‌మ్యాప్ రూపొందుతోంది. సీఎం, ఆజాద్‌ల ప్రచారాల తేదీలు, వేదికల నిర్ణయాన్ని అభ్యర్థులు వివేకా, డీఎల్ రవీంద్రారెడ్డిలకు అప్పగించారు. తెలంగాణ మంత్రులకూ ప్రచారాల్లో బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. వారిని బృందాలుగా ప్రచారానికి పంపే ఏర్పాట్లను మంత్రులు శ్రీధర్‌బాబు, డీకే అరుణ చూడనున్నారు. కడప లోక్‌సభ పరిధిలో మైనార్టీల ఓట్లు కీలకంగా ఉండటంతో మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ మహ్మద్ జానీలకు ఆ బాధ్యతలు అప్పగించారు. మరికొందరు మైనారిటీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, నేతలను ఆ వర్గపు ఓట్లు ఎక్కువగా ఉన్న చోట్లకు పంపనున్నారు. వీరంతా జిల్లాకు చెందిన మైనార్టీ సంక్షేమ మంత్రి అహ్మదుల్లాతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.

కాంగ్రెస్‌లో మనవారెవరో గుర్తించాలి!
ఇంత కీలక సమావేశంలోనూ కొసమెరుపు ఏమిటంటే... అసలు కడప లోక్‌సభ పరిధిలోని కాంగ్రెస్ నేతల్లో తమ వారెవరో... పరాయి వారెవరో ముందు తేల్చాలంటూ ఆసక్తికరంగా చర్చ జరిగింది. కడప కాంగ్రెస్ నేతల్లో ఎవరెటు వైపున్నారో ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి ఉందని, దీనిపై జాగ్రత్తగా ఉండకపోతే నిండా మునుగుతామేమోనన్న అనుమానాలు వ్యక్తమైనట్టు తెలిసింది. అందుకే నియోజకవర్గాల బాధ్యతలు తీసుకున్న మంత్రులు ముందుగా తమ పరిధిలో గ్రామాలవారీగా కాంగ్రెస్ నేతల్లో నిజంగా పార్టీ వెంట నడుస్తున్నదెవరు, జగన్‌ను అభిమానిస్తున్నదెవరో గుర్తించాలని సీఎం కిరణ్ సమావేశంలో పదేపదే సూచించారు. అది జరిగాకే పార్టీ వ్యూహాన్ని పక్కాగా అమలు చేయడానికి వీలుంటుందని, లేనిపక్షంలో ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరే అవుతాయని మంత్రులు, నేతలు ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది.