బాబును కలిసినా తెలంగాణపై వైఖరి మారదు: మాజీ మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి

బాబును కలిసినా తెలంగాణపై వైఖరి మారదు: మాజీ మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి




 తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును ఆ పార్టీ సీనియర్ శాసనసభ్యుడు, మాజీ మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి రెండు నెలల తర్వాత కలిశారు. చంద్రబాబు నాయుడు 62వ పుట్టినరోజు సందర్భంగా నాగం జనార్ధన్ రెడ్డి బాబును ఆయన గృహంలో కలిశారు. కానీ చంద్రబాబును కలిసినప్పటికీ తెలంగాణపై తన వైఖరిలో ఎలాంటి మార్పు లేదని నాగం ప్రకటించారు. తెలంగాణపై ఎలాంటి పరిస్థితుల్లోనూ తన వైఖరిలో మార్పుండదని నాగం తేల్చి చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన 177 చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని నాగం డిమాండ్ చేశారు. గడువులోగా ప్రభుత్వం 177 చట్టాన్ని వెనక్కి తీసుకోకుంటే, ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాడం చేస్తామన్నారు.

అలాగే కాంగ్రెసు ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మొట్టికాయలు తప్పవని నాగం జనార్ధన్‌రెడ్డి బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. బుధవారం తెలంగాణ జెఏసి నాయకులు నాగంను కలిశారు.

శ్రీకృష్ణ కమిటీ 8వ అధ్యాయంపై హైకోర్టులో చుక్కెదురయిందని చెప్పారు. హైకోర్టు ఆదేశాలు ప్రభుత్వం పాటిస్తే బావుండేదని నాగం వ్యాఖ్యానించారు. అయితే ప్రభుత్వం హైకోర్టు నిర్ణయంతో విభేదిస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లడం విచారకరమన్నారు.