ధర్మమే తెలంగాణను గెలిపిస్తుంది

ధర్మమే తెలంగాణను గెలిపిస్తుంది
హైదరాబాద్, న్యూస్‌లైన్: ధర్మమే తెలంగాణ ప్రజలను గెలిపిస్తుందని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం, ప్రపంచ శాంతి కోసం గురువారం హైదరాబాద్ శివార్లలో మొయినాబాద్ మండలంలోని హిమాయత్‌నగర్ సమీపంలో ప్రారంభమైన శత చండీయాగంలో ఆయన సతీ సమేతంగా పాల్గొన్నారు. యజ్ఞ యాగాదులతో గతంలో అనేక విజయాలు సాధించిన సందర్భాలు అనేకమున్నాయని విలేకరులతో ఆయనన్నారు.

‘‘ప్రపంచంలో ఆస్తికులుంటారు. నాస్తికులుంటారు. ఎవరికి తోచినట్టు వారు చేస్తారు. ఏటా రెండు మూడుసార్లు యాగాలు చేయటం నా అలవాటు. తెలంగాణలో అశాంతి, ఆందోళన, దోపిడీల నివారణకు శతచండీయాగం దోహదపడుతుంది. యాగం చివరి రోజు శనివారం తెలంగాణకు చెందిన వేద పండితులు, పంచాంగ కర్తలు మహా పూర్ణాహుతిలో పాల్గొం టారు. సీమాంధ్రులు ఎన్ని కుతంత్రాలు పన్నినా తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది. ఆ తర్వాత ఇక్కడే 1,500 మంది బ్రాహ్మణులతో సహస్ర చండీయాగం చేయిస్తా’’ అని చెప్పారు. టీఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సభ్యులు ఎ.చంద్రశేఖర్, శ్రవణ్‌కుమార్, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి దంపతులతో పాటు టీఆర్‌ఎస్, జేఏసీ నాయకులు చండీయాగానికి హాజరైన వారిలో ఉన్నారు.

బ్రాహ్మణ సభ వాల్‌పోస్టర్ ఆవిష్కరణ
మే 1న హైదరాబాద్‌లో బ్రాహ్మణుల జేఏసీ నిర్వహించే ‘తెలంగాణ అర్చక బ్రాహ్మణ శంఖారావం’ బహిరంగ సభ వాల్‌పోస్టర్‌ను కేసీఆర్ ఆవిష్కరించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడేందుకు బ్రాహ్మణులు కూడా ముందుకొచ్చారన్నారు. సభలో తప్పక పాల్గొంటానని చెప్పారు.