తెలంగాణకు వ్యతిరేకంగా జూన్‌లో ప్రకటన!
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేత‘గోనె’ అనుమానం
అందుకు నాందిగా 177జీవో
కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా డ్రామాలు ఆపాలి
హైదరాబాద్,న్యూస్‌లైన్: జూన్‌లో తెలంగాణకు వ్యతిరేకంగా ప్రకటన వెలువడే అవకాశం ఉందని, అందుకే ముందస్తు చర్యగా జీవో 177 జారీ చేశారని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్‌రావు అభిప్రాయపడ్డారు. సచివాలయంలో గురువా రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తరువాత కూడా తెలంగాణపై కేంద్రం సానుకూల ప్రకటన చేసే అవ కాశం లేదన్నారు. ఆ సమయంలో ఉద్యమం ఎగిసిపడే అవకాశం ఉన్నందున ఎటువంటి చర్చలు జరపకుండా హడావుడిగా ఉద్యమాన్ని అణచేందుకు నల్ల జీవో 177 విడుదల చేశారని తెలిపారు. గతంలో శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు తెలంగాణకు వ్యతిరేకంగా వస్తుందని తెలుసుకున్న అధిష్టానం తెలంగాణలో పెద్ద ఎత్తున పారామిలటరీ బలగాలను మోహరించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్న కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ఏర్పాటు దిశగా ఇప్పుడిప్పుడే ముందడుగు వేసే లా లేదని, అవసరమైతే ఉద్యమాన్ని అణచాలని చూస్తుందన్నారు.
దీనికి తోడు నాకు ఏ వాదం లేదంటూనే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణకు వ్యతిరేకంగా అధిష్టానానికి తప్పుడు నివేదికలు పం పిస్తూ మోకాలడ్డుతున్నారని ఆరోపిం చారు. ఆయన పక్కా సమైక్యవాదన్నారు. దేశ రాజకీయాల్లో కీలకమైన ఉత్తర్‌ప్రదేశ్‌లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఎన్నికలు పూర్తయ్యేంత వరకు అధిష్టానం తెలంగాణపై ఎటూ తేల్చదని స్పష్టం చేశారు. కాబట్టి మేలో ప్రకటనల రాకపోతే రాజీనామలు చేస్తామని ప్రకటించిన నాయకులప్పుడు నిజంగా రాజీనామాలు చేసి ఉద్యమం చేపట్టాలన్నారు. లేకపోతే ప్రజలు తిరగబడతారంటూ హెచ్చరించారు.
చిత్తశుద్ధి లేని నాయకుల్ని తరిమికొట్టండి
చిత్తశుద్ధి లేని, రాజీనామాలు చేయని కాంగ్రెస్ నాయకులను పిచ్చికుక్కల్ని కొట్టినట్లు తరిమికొట్టాలని గోనె ప్రకాశరావు పిలుపునిచ్చారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై ప్రజల్లో భావోద్వేగాలు వెల్లువెత్తిన ప్రతిసారీ ఎంపీలు మధు యాష్కీ, గుత్తా సుఖేందర్‌రెడ్డి, కేకే తదితర కాంగ్రెస్ నాయకులు రాజీనామాలు చేస్తాం, రాజకీయ సన్యాసం చేస్తామని ప్రకటనలు గుప్పించడం తప్ప వారు చేసిందేమీలేదని దుయ్యబట్టారు. ఈసారి నిజమైన రాజీనామాలు చేయకపోతే వారిపై ప్రజలు దుమ్మెత్తి పోయడం ఖాయమన్నారు. విద్యార్థులు, ఉద్యోగుల త్యాగాలమీదే తెలంగాణ ఉద్యమం నడుస్తుందన్నారు. విద్యార్థులపై అక్రమ కేసులు పెట్టడం, సహాయనిరాకరణ సందర్భంగా చర్చలకు ఢిల్లీ వెళ్లిన నేతలపై అవినీతి ఆరోపణలు వచ్చేలా చేసి వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఈ ప్రభుత్వం కుట్రపన్నిందని ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటు సంగతి తర్వాత ముందు సహాయనిరాకరణ చేసిన ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని గోనె డిమాండ్ చేశారు.