ఎన్టీఆర్ భవన్‌లో చిల్లరగాళ్లు .ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో విడిగా ఆఫీసు పెట్టుకోబోతున్నా. మేరెండో వారం నుంచి తెలంగాణ సాధన ఉద్యమం

ఎన్టీఆర్ భవన్‌లో చిల్లరగాళ్లు .ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో విడిగా ఆఫీసు పెట్టుకోబోతున్నా మేరెండో వారం నుంచి తెలంగాణ సాధన ఉద్యమం

పార్టీలో వచ్చే వాళ్లు వస్తారు రాని వాళ్లు రారు
తెలుగు దేశంలో మళ్లీ నాగమాగం
చంద్రబాబు పై ఫైర్
తెలంగాణ పై స్పష్టత ఇస్తేనే కడప ప్రచారానికి వెళ్తా
ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలమేనని స్పష్టంగా చెప్పాలి
అధినేతకు షరతులు
తెలంగాణ వచ్చాక టీడీపీ కంటే జగన్‌కే విశ్వసనీయత అని వ్యాఖ్య
టీడీపీ అధినాయకత్వానికి ఇప్పటికే కొరకరాని కొయ్యగా మారిన.. సీనియర్ ఎమ్మెల్యే నాగం జనార్దనరెడ్డి.. తన స్వరాన్ని పెంచారు. షరతులు, విసుర్లు, వ్యంగ్యాస్త్రాలతో పార్టీ అధినేత చంద్రబాబుపై.. పరోక్ష యుద్ధం ప్రకటించారు. కడపకు అన్ని ప్రాంతాల నుంచి సీనియర్లను సమీకరించి పంపాలని పార్టీ నాయకత్వం ప్రయత్నిస్తున్న తరుణంలో అక్కడకు తెలంగాణలోని టీడీపీ నేతలు ఎవరూ వెళ్ళవద్దంటూ నాగం నిన్న గాక మొన్ననే బహిరంగంగా పిలుపునిచ్చారు.

శుక్రవారం మరో అడుగు ముందుకేసి.. పార్టీ అధ్యక్షుడికి ఈ విషయంలో ఏకంగా షరతు పెట్టారు. తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు నిర్ణయం ప్రకటించాలని, అప్పుడే తాను కడప వెళ్తానని నాగం స్పష్టం చేశారు. "తెలంగాణ అంశంపై చంద్రబాబు స్పష్టత ఇస్తేనే.. కడప ఎన్నికల ప్రచారానికి వెళ్తాను. ఆ స్పష్టత కూడా తెలంగాణకు అనుకూలంగా మాత్రమే ఉండాలి. తెలంగాణ సాధనకు మేం కట్టుబడి ఉన్నామని... ఎన్నికల మ్యానిఫెస్టోలో ఏం చెప్పామో.. అదే మా వైఖరి అని చంద్రబాబు స్పష్టంగా ప్రకటించాలి' అని డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో చిల్లరగాళ్ళు ఉన్నారంటూ నాగం సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇవన్నీ చంద్రబాబుకు తెలియకుండా ఉంటాయా? అన్నారు. పార్టీ కార్యాలయానికి వెళ్ళడానికి తనకు మనస్కరించడం లేదని, ఇక్కడి పాత ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఒక కార్యాలయాన్ని తాను ఏర్పాటు చేసుకొంటున్నట్లు ప్రకటించారు. ఇకపై తనను కలవాల్సిన కార్యకర్తలు అక్కడకే రావాలని నాగం సూచించారు. చంద్రబాబుపై విసుర్లు విసిరిన నాగం.. వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్‌ను మాత్రం ప్రశంసలతో ముంచెత్తారు.

'రేపు మే లోనో... జూన్‌లోనో కేంద్రం తెలంగాణ ఇస్తుంది. తెలంగాణ వస్తే ఇక్కడ జగన్‌కు క్రెడిబులిటీ ఉంటుంది తప్ప మాకు ఉండదు' అని నాగం అనడం గమనార్హం. పార్టీ నేతలు తనతో వచ్చినా రాకపోయినా.. మే రెండో వారంలో తన నియోజకవర్గం నుంచి తెలంగాణ సాధన ఉద్యమం మొదలు పెడతానని కూడా ఆయన ప్రకటించారు.

హైదరాబాద్, ఏప్రిల్ 15 : తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి కొరకరాని కొయ్యగా మారిన నాగం జనార్దనరెడ్డి.. మరో సారి పెదవి విప్పారు. అధినేతను ఇరుకున పెట్టే రీతిలో మళ్లీ వాగ్బాణాలు సంధించారు. తెలంగాణ అంశంపై చంద్రబాబు స్పష్టత ఇస్తేనే.. కడప ఎన్నికల ప్రచారానికి తాను వెళ్తానని నాగం ప్రకటించారు. ఆ స్పష్టత తెలంగాణకు అనుకూలంగా మాత్రమే ఉండాలన్నారు. నాగం శుక్రవారం ఇక్కడి టీడీఎల్పీ కార్యాలయంలో విలేకరులతో ముచ్చటించారు.

'తెలంగాణపై చంద్రబాబు స్పష్టత ఇస్తే.. నేను ఇదే బట్టలతో ఇటు నుంచి ఇటే కడప వెళ్ళి, ఎన్నికల ప్రచారంలో పాల్గొంటా. తెలంగాణ సాధనకు మేం కట్టుబడి ఉన్నామని... ఎన్నికల మ్యానిఫెస్టోలో ఏం చెప్పామో.. అదే మా వైఖరి అని చంద్రబాబు చెప్పాలి' అని నాగం పేర్కొన్నారు. తెలంగాణకు తమ పార్టీ అనుకూలమేనని ప్రకటించాలని డిమాండ్ చేశారు. 'అలా చెబితే తెలంగాణ వస్తుందా?' అని నాగంను విలేకరులు అడగ్గా.. "మాకు విశ్వసనీయత పెరుగుతుంది'' అని బదులిచ్చారు.

ఎన్టీఆర్ భవన్‌లో చిల్లరగాళ్లు
పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో చిల్లరగాళ్ళు ఉన్నారంటూ నాగం సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌తో నాగం ఫోన్లో మాట్లాడారంటూ ఓ పత్రికలో వచ్చిన వార్తను ప్రస్తావించినప్పుడు.. ఆయన ఈ వ్యాఖ్య చేశారు. 'పార్టీ ఆఫీసులోని చిల్లరగాళ్ళు ఇవన్నీ రాయిస్తున్నారు. వాళ్ళు డైరెక్షన్ ఇస్తారు. వీళ్ళు రాస్తారు. చివరకు ఇద్దరూ పోతారు' అని నాగం మండిపడ్డారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఇవన్నీ తెలియవా? అన్న ప్రశ్నకు.. "ఆయన (చంద్రబాబు) ఆఫీసులో జరిగేవి ఆయనకు తెలియకుండా ఉంటాయా?'' అంటూ నాగం ఎదురు ప్రశ్న వేశారు. పార్టీ కార్యాలయానికి వెళ్ళడానికి తనకు మనస్కరించడం లేదని, ఇక్కడి హైదర్‌గూడాలోని పాత ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సొంతంగా ఒక కార్యాలయం ఏర్పాటు చేసుకొంటున్నానని ప్రకటించారు.

వైఎస్ తనయుడిపై ప్రశంసల జల్లు
చంద్రబాబుపై విసుర్లు విసిరిన నాగం.. వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్‌ను మాత్రం ప్రశంసలతో ముంచెత్తారు. ఈ మాట రాయవద్దని అంటూనే జగన్‌ను మెచ్చుకొన్నారు. 'రేపు మే లోనో... జూన్‌లోనో కేంద్రం తెలంగాణ ఇస్తుంది. తెలంగాణ వస్తే ఇక్కడ జగన్‌కు క్రెడిబులిటీ ఉంటుంది తప్ప మాకుండదు' అని ఆయన వ్యాఖ్యానించారు. ఆయనే.. అంతకు ముందొకసారి .. 'మొదటి నుంచి నేను వైఎస్ ప్రభుత్వ అవినీతిపై పోరాడాను. ఓబుళాపురం గనుల విషయంలో పోరాడింది నేనే. నేను డబ్బుకు లొంగిపోతానా? సీఎం వద్దకు.. బుల్లెట్ ప్రూఫ్ కారు కోసం, పీఏ కోసం తప్ప మరో పని కోసం నేను వెళ్ళలేదు' అన్నారు.

తెలంగాణ సాధన ఉద్యమం మొదలెడతా!
మే రెండో వారంలో తన నియోజకవర్గం నుంచి తెలంగాణ సాధన ఉద్యమం మొదలు పెడతానని నాగం ప్రకటించారు. తొమ్మిదో తేదీ నుంచి మొదలు పెట్టాలని అనుకొన్నా.. మంచి రోజు చూపి మొదలు పెడతానని చెప్పారు. తెలంగాణలో వివిధ ప్రాంతాలలో తాను పర్యటిస్తానని, టీడీపీ తెలంగాణ ఫోరం తరపునే ఈ పర్యటన ఉంటుందని ఆయన తెలిపారు. "ఈ పర్యటన కోసం నిర్ణయం తీసుకున్నాను. వచ్చే వాళ్లు నాతో వస్తారు. రానివాళ్ళు రారు'' అని చెప్పారు.