పవన్‌కళ్యాణ్ కెరీర్‌లో ‘తీన్‌మార్’ నంబర్‌వన్ చిత్రంగా రికార్డులు సృష్టిస్తోంది

పవన్‌కళ్యాణ్ కెరీర్‌లో ‘తీన్‌మార్’ నంబర్‌వన్ చిత్రంగా రికార్డులు సృష్టిస్తోంది


‘‘పవన్‌కళ్యాణ్ కెరీర్‌లో ‘తీన్‌మార్’ నంబర్‌వన్ చిత్రంగా రికార్డులు సృష్టిస్తోంది. ఈ చిత్రం మొదటి రోజే 9 కోట్ల 40 లక్షల గ్రాస్‌ను, ఒక్క నైజాంలోనే మొదటి రోజు 2 కోట్ల 17 లక్షలు వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఈ వసూళ్ళు మా చిత్రం యూనిట్ అందరిలోనూ మంచి ఉత్సాహాన్ని నింపుతోంది’’ అన్నారు గణేష్‌బాబు. పవన్‌కళ్యాణ్, త్రిష జంటగా జయంత్.సి.పరాన్జీ దర్శకత్వంలో ఆయన నిర్మించిన చిత్రం ‘తీన్‌మార్’. ఈ సినిమా ఈ నెల 14న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భగా శుక్రవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ ‘‘పవన్‌కళ్యాణ్‌ను ఆయన అభిమానులు, ప్రేక్షకులు ఎలా చూడాలనుకున్నారో.. ‘తీన్‌మార్’లో అలాగే చూపించాం. ఆయన అభినయం, త్రివిక్రమ్ సంభాషణలు చిత్రానికి హైలైట్‌గా నిలిచాయి.

చిత్రం విడుదలైన మొదటి ఆటకే యూనివర్శల్‌గా హిట్ టాక్‌తో హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో రన్ అవుతోంది. తప్పకుండా ఈ చిత్రం తెలుగు సినీ పరిశ్రమలో సరికొత్త రికార్డులను సృష్టిస్తుందనే నమ్మకం వుంది. ఇక సినీ పరిశ్రమను పట్టిపీడిస్తున్న పైరసీ బారిన ‘తీన్‌మార్’ పడకుండా వుండటానికి తగు చర్యలు చేపడుతున్నాం’’ అన్నారు. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ విజయాలు లేక స్లంప్‌లో వుందని, ఇలాంటి తరుణంలో ‘తీన్‌మార్’ ఘనవిజయం సాధించడం ఆనందంగా వుందని నాగబాబు చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమలోని కొంత మంది వ్యక్తులు ఏ సినిమా విడుదలైనా పనికట్టుకొని ఆ సినిమాకు నెగెటివ్ టాక్ ప్రచారం చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని, ఓ నిర్మాతకు సక్సెస్ వస్తే అది పరిశ్రమ మొత్తానికి వచ్చినట్లేనని, అందుకే ఇప్పటికైనా వాళ్ళు ఈ పనులు మానుకోవాలని నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు.