‘దేశం’ లో అన్నదమ్ముల సవాల్ !
తెలుగుదేశంలో ఆధిపత్యపోరు చివరకు అటు తిరిగి ఇటు తిరిగి అన్నదమ్ముల సవాల్‌గా మారడం ఆసక్తి కలిగిస్తోంది. ఎన్టీఆర్ కుమారులు హరికృష్ణ, బాలకృష్ణ చెరో వైపు చీలిపోవడం పార్టీ శ్రేణులను ఆందోళన పరుస్తోంది. కేంద్రమంత్రి పురంధేశ్వరి సూత్ర దారిగా ప్రచారంలో ఉన్న తాజా పరిణామాలలో హరికృష్ణ ఆమె వైపు, మరో సోదరుడు బాలకృష్ణ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వైపు నిలిచిన వైనం చర్చనీయాంశమయింది.తన సోదరి పురంధేశ్వరి ప్రయత్నాలకు మద్దతుగా హరికృష్ణ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన బాబుపై తన అసంతృప్తి, ఆగ్రహాన్ని బాహాటంగా వ్యక్తం చేయకపోయినప్పటికీ, కృష్ణా జిల్లా నేతలు వంశీ, నాని ద్వారా తన అసంతృప్తిని వెల్లడిం చిన విషయం తెలిసిందే. తాజాగా బాబు పాదయాత్రలో ఉన్న సమయంలో లేఖ విడుదల చేయడం వివాదాస్పదంగా మారింది. పురంధే శ్వరి సహకారంతో సోదరుడు బాలకృష్ణ, తనయుడు ఎన్టీఆర్‌ను సమన్వయం చేసుకుని చంద్రబాబునాయుడుపై తిరుగుబాటు బావుటా ఎగరేయాలన్నది హరికృష్ణ అసలు లక్ష్యమం టున్నారు.
వారిద్దరూ తాను చెప్పినట్లు వింటా రని హరికృష్ణ ఆశించినట్లు కనిపిస్తోంది.అయితే, సోదరుడు బాలకృష్ణ మాత్రం హరికృష్ణ ప్రయత్నాలకు సహకరించకపోగా, తాను టీడీపీలోనే ఉంటానని, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానంటూ అడ్డం తిరగటం హరికృష్ణను ఖంగుతినిపించింది. జనంలో ఇమేజ్ ఉన్న బాలయ్య మీద బోలెడన్ని ఆశలు పెట్టుకుని, ఆయన దన్నుతో ‘దేశం’లో దుమ్మురేపుదామని ఆశించిన హరి ప్రయత్నాలకు ఆదిలోనే హంసపాదు ఎదురవడం నిరాశ కలిగించింది.
అటు.. సోదరుడు బాలకృష్ణ సైతం తనకు సంబంధం లేకపోయినా తనను ఈ వివాదంలో లాగుతున్నందుకు సోదరి-సోదరుడిపై ఆగ్రహం తో ఉన్నట్లు సమాచారం. తనకు- తన వియ్యంకుడైన బాబు మధ్య దూరం పెంచడాన్ని బాలయ్య సహించలేకపోతున్నారు. రాజకీయా ల్లో రాణించాలన్నా, పార్టీ పగ్గాలు తీసుకోవాల న్నా అందుకు తగ్గ రాజకీయానుభవం తమ కుటుంబానికి లేదని, దానికి ఇంకా సమయం పడుతుందని బాలయ్య భావిస్తున్నారు. బాబు స్ధాయిలో పార్టీని నడిపించే శక్తి, ఓపిక, రాజకీయ వ్యూహాలు తమకు లేవన్నది ఆయన నిశ్చితాభిప్రాయంగా కనిపిస్తోంది. పూర్తి స్థాయి రాజకీయాల్లో కొనసాగాలంటే తాము పార్టీకి పూర్తి సమయాన్ని కేటాయించవలసి ఉంటుం దని, నిరంతరం ప్రజల మధ్యకు వెళ్లవలసి ఉంటుందన్న విషయం బాలయ్యకు తెలుసంటున్నారు.
హరికృష్ణ కూడా ఆరోగ్య రీత్యా పార్టీకి పూర్తి కాలం సమయం కేటాయించలేరని, ఆయనకు పార్టీని చక్కదిద్దాలన్న ఆలోచన ఉన్నప్పటికీ, అందుకు ఆయన ఆరోగ్యం ఏ మాత్రం సహక రించదన్నది బాలకృష్ణ భావనగా చెబుతున్నారు. బాబు మాదిరిగా ఆలోచించే శక్తి లేదని, హరికి ఉన్నదల్లా ఆవేశమేనని, అది టీడీపీని బతికించలేదని బాలయ్య అభిప్రాయ పడుతు న్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ పేరుతో లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ తెలుగుదేశం, గతంలో తన సోదరుడు అన్న తెలుగుదేశం పార్టీ పెట్టినా ప్రజలు వాటిని తిరస్కరించి, ఎన్టీఆర్ రాజకీయ వారసుడిగా బాబు సారధ్యంలోని తెలుగుదేశం పార్టీనే ఆమోదించినందున.. తాను ఎవరి ఒత్తిళ్లకూ లొంగకూడదని బాలయ్య నిర్ణయిం చుకున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
అదీకాకుండా.. తన పేరును విని యోగించుకుని హరికృష్ణ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపై తిరుగుబాటుకు తెరలేపడం, దానికి సోదరి పురంధేశ్వరి సహకరించడాన్ని బాలయ్య సహించలేకపోతున్నట్లు సమాచారం. ఈ వివాదంలో అనవసరంగా తలదూర్చవద్దని జూనియర్ ఎన్టీఆర్‌కు బాలయ్య హితవు పలికినట్లు తెలుస్తోంది. స్వయంగా ఎన్టీఆర్ కుటుంబం టీడీపీని చీల్చే ప్రయత్నాలు చేస్తోందన్న సంకేతాలు కుటుంబానికి మంచిది కాదని బాలయ్య జూనియర్‌కు చెప్పినట్లు తెలిసింది. అయితే, తాను ఎలాంటి వివాదాల్లోకి వెళ్లదలచుకోలేదని, కావాలంటే తాను కూడా ఆ మేరకు ప్రకటన విడుదల చేస్తానని జూనియర్ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం.
తన సోదరుడు తన యత్నాలకు సహక రించకపోగా, తాను వ్యతిరేకిస్తున్న బాబుకు బాసటగా నిలవడాన్ని హరికృష్ణ జీర్ణించుకో లేకపోతున్నట్లు చెబుతున్నారు. దీనితో బాలయ్యను వదలిపెట్టి, తనయుడైన ఎన్టీఆర్ మనసు మళ్లించాలన్న ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ పరిణామాలతో పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ అంశం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడి, కాంగ్రెస్-జగన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న సమయంలో హరికృష్ణ వ్యవహారశైలి పార్టీకి నష్టదాయకంగా మారిందన్న ఆవేదన శ్రేణుల్లో కనిపిస్తోంది. పార్టీని అధికారంలోకి తీసుకురావలసిన వారే పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.







