డీఎల్‌ను నిలదీసిన జనం

డీఎల్‌ను నిలదీసిన జనం
 పెద్దముడియం(వైఎస్‌ఆర్ జిల్లా), న్యూస్‌లైన్: ఎన్నికల ప్రచారంలో మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డికి చుక్కెదురైంది. పెద్దముడియం మండలంలోని పలు గ్రామాల్లో ప్రజలు వారిని అడ్డుకున్నారు. వైఎస్‌ఆర్ అవినీతికి పాల్పడ్డారంటూ మీడియాకుఎక్కిన డీఎల్ ఏముఖంతో తిరిగి మహానేత ఫొటోను పెట్టుకొని ఓట్లు అడగడానికి వచ్చాడని నెమళ్లదిన్నె, పెద్దముడియం గ్రామాల్లో వైఎస్‌ఆర్ అభిమానులు నిలదీశారు. వైఎస్‌ఆర్‌ను విమర్శించిన మీరు ఆయన బొమ్మతోనే ఎందుకు ప్రచారానికి వచ్చారని సూటిగా అడిగారు.

ఒకవేళ ప్రచారం చేయదలుచుకుంటే జగన్ ఫొటో కూడా పెట్టుకొని రాలేక పోయారా అని నెమళ్లదిన్నె వాసులు సూచించారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారని, వైఎస్‌ఆర్ మరణం తర్వాత ఏమి అభివృద్ధి చేశారంటూ ప్రశ్నించారు. పొరుగున ఉన్న కర్నూలు జిల్లాలో రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ వచ్చిందని, మన జిల్లాకు ఎందుకు తీసుకు రాలేదని వారు నిలదీశారు. వరద కాలువపై బ్రిడ్జిలు ఎందుకు నిర్మించలేక పోయారని ప్రశ్నించారు.