లోక్‌పాల్ బిల్లు రూపకల్పన కమిటీలో సీడీ వివాదం

లోక్‌పాల్ బిల్లు రూపకల్పన కమిటీలో సీడీ వివాదం


లోక్‌పాల్ బిల్లు రూపకల్పన కమిటీలో సీడీ వివాదం చిచ్చు రేపింది. సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయం సింగ్, అమర్ సింగ్‌లతో కమిటీలోని పౌరసమాజం సభ్యుల్లో ఒకరైన న్యాయవాది శాంతిభూషణ్ జరిపిన సంభాషణలను రికార్డు చేసిన సీడీ అసలైనదేనని ఢిల్లీలోని ప్రభుత్వ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ గురువారం తేల్చి చెప్పింది. కల్పిత సంభాషణలతో ఆ సీడీని సృష్టించారన్న శాంతి భూషణ్ వాదన తప్పని తన నివేదికలో స్పష్టం చేసింది. దీంతో శాంతిభూషణ్ కమిటీ నుంచి తప్పుకోవాలనే డిమాండ్లు పెరిగాయి. తాజా పరిణామాలతో కలత చెందిన జస్టిస్ సంతోష్ హెగ్డే, లోక్‌పాల్ కమిటీ నుంచి రాజీనామా చేసే విషయమై ఆలోచిస్తానని ప్రకటించారు.

ఆయన గురువారం బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. శనివారం ఢిల్లీ చేరుకున్నాక, తన సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. అవినీతి వ్యతిరేక పోరాటాన్ని అణచివేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అయితే సీడీ వివాదంపై మాట్లాడుతూ, ఈ విషయాన్ని ఇప్పుడే ఎందుకు లేవనెత్తుతున్నారని, ఇన్నాళ్లూ ఎందుకు మౌనం దాల్చారని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా, శాంతి భూషణ్ సీడీలోని సంభాషణల్లో మాటలు కలిపినట్లుగా ఎలాంటి దాఖలాలూ లేవని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (సీఎఫ్‌ఎస్‌ఎల్) నివేదిక ఇచ్చినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు విభాగానికి అప్పగించినట్లు చెప్పారు.

సంభాషణలు కల్పితమే: ట్రూత్ ల్యాబ్స్
ఆ సీడీలోని సంభాషణలు కల్పితమేనని హైదరాబాద్‌లోని ట్రూత్ ల్యాబ్స్ ఇదివరకు నిర్ధారించింది. శాంతిభూషణ్ కోరిక మేరకు పరీక్షలు నిర్వహించింది. సీడీ కల్పితమని తాము ఇచ్చిన నివేదికకే కట్టుబడి ఉన్నామంటూ ట్రూత్ ల్యాబ్స్ డెరైక్టర్ ఎస్.ఆర్.సింగ్ స్పష్టం చేశారు. రికార్డింగులో పలు కీలక సందర్భాల్లో ఎలక్ట్రానిక్ ఎడిటింగ్ చేసి, మాటలు కలిపారని తెలిపారు.

భూషణ్‌లు రాజీనామా చేయాలి: అమర్ సింగ్
ప్రభుత్వ ఫోరెన్సిక్ ల్యాబ్ తాజా నివేదిక నేపథ్యంలో లోక్‌పాల్ బిల్లు రూపకల్పన కమిటీకి తండ్రీ కొడుకులైన శాంతి భూషణ్, ప్రశాంత్ భూషణ్‌లు రాజీనామా చేయాలని రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ డిమాండు చేశారు. వారి స్థానంలో వేరెవరినైనా అన్నా హజారే ఎంపిక చేసుకోవాలని సూచించారు. సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తున్న 2జీ కుంభకోణం దర్యాప్తు పక్కదోవ పట్టిస్తున్నట్లు తనపై వచ్చిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. ‘అక్రమ ఫోన్ ట్యాపింగ్‌లో నేనూ బాధితుణ్ణే. ఆ సీడీలో నా మాటలూ ఉన్నాయి. ముంబైలో బాగా పేరున్న ఒక వ్యాపార కుటుంబం ఈ ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడింది. వారి పేర్లు చెప్పే పరిస్థితిలో లేను. ఎవరి పేరైనా బయటపెడితే నా బతుకు ముగిసినట్లే. నేనిప్పటికే చాలా దెబ్బలు తిన్నాను’ అని ఆందోళన వ్యక్తం చేశారు.

మీకు మీరే క్లీన్‌చిట్ ఇచ్చేసుకుంటారా?: దిగ్విజయ్
తనపై ఆరోపణలకు కారణమైన సీడీకి ల్యాబ్‌లో పరీక్షలు జరిపించి, అందులోని మాటలు కల్పితమంటూ శాంతిభూషణ్ తనకు తానే క్లీన్‌చిట్ ఇచ్చేసుకున్నారని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ధ్వజమెత్తారు. ఇలాగైతే 2జీ కేసు దర్యాప్తు బాధ్యతలను మాజీ మంత్రి రాజాకే అప్పగించాలని వ్యాఖ్యానించారు. శాంతిభూషణ్ పంపిన పరువునష్టం దావా లీగల్ నోటీసులపై స్పందిస్తూ, ‘నాకు నోటీసులు అందలేదు. అయినా పరువునష్టం దావాలతో నన్నిలా బెదిరించవద్దని ఆయనను కోరుతున్నా. దీనిబదులు సీడీ వివాదంలోను, నోయిడా ప్లాట్ల కేటాయింపులోను తనను తాను సచ్ఛీలుడుగా నిరూపించుకోవాలని కోరుతున్నా’ అని వ్యాఖ్యానించారు.

కమిటీ నుంచి ఎవరూ తప్పుకోవడం లేదు: కేజ్రీవాల్
లోక్‌పాల్ బిల్లు రూపకల్పన కమిటీ నుంచి ఎవరూ రాజీనామా చేయడం లేదని కమిటీలోని పౌర సమాజం సభ్యుడు అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఢిల్లీలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కమిటీ సభ్యులు రాజీనామా చేస్తున్నారని, ప్రత్యామ్నాయంగా సభ్యులను వెతుకుతున్నారని వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. కమిటీ సభ్యులపై ఆరోపణలు చేయడం వల్ల ఎవరికి ప్రయోజనం చేకూరుతుందో దేశప్రజలు ఆలోచించాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. సీడీపై సీఎఫ్‌ఎస్‌ఎల్ ఇచ్చిన నివేదికలో ఏముందో తనకు తెలియదన్నారు. తాము జరిపించిన పరీక్షల్లో ట్యాంపరింగ్ జరిగినట్లు తేలిందని, సీడీ సంభాషణల్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై ఆరోపణలు రావడంతో ప్రత్యేక విచారణ కోసం తమంతట తామే స్వయంగా ముందుకు వచ్చామని చెప్పారు. కాగా, ప్రతిపక్షం నుంచి ఒక నేతను తీసుకోవాలని ఒకరు ప్రతిపాదించగా సున్నితంగా తిరస్కరించామని కిరణ్ బేడీ చెప్పారు. ఎవరు ప్రతిపాదించారు, ఎవరు తిరస్కరించారనే విషయాలు అడగవద్దని ఆమె మీడియా ప్రతినిధులను కోరారు. ట్యాంపరింగ్ జరిగినట్లు అమెరికన్ నిపుణులు నిర్ధారించగా, అది కల్పితం కాదంటూ సీఎఫ్‌ఎస్‌ఎల్ చెప్పడం ఆశ్చర్యంగా ఉందని, ఈ నివేదికను నమ్మలేమని మానవ హక్కుల కార్యకర్త స్వామి అగ్నివేశ్ అన్నారు.

వివాదాలపై మాట్లాడటం మానేశాను: హజారే
శాంతిభూషణ్ సీడీ వివాదంపై మాట్లాడేందుకు అన్నా హజారే నిరాకరించారు. వివాదాలపై తాను మాట్లాడటం మానేశానన్నారు. సీడీ గురించి తనకేమీ తెలియదని, ఈ విషయాన్ని శాంతిభూషణ్‌నే అడగండని మీడియా ప్రతినిధులకు బదులిచ్చారు.

నేరుగా వ్యాఖ్యలు చేయని కాంగ్రెస్, బీజేపీ
సీడీ వివాదంపై కాంగ్రెస్, బీజేపీలు నేరుగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. భూషణ్ తప్పుకోవడమే మేలనే విధంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ తివారీ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. సమాజాన్ని కొన్ని నైతిక విలువలతో కొలిచేవారు తమ నైతికతపై తాము ఆత్మావలోకనం చేసుకోవాలని అన్నారు. భూషణ్‌ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారా అని ప్రశ్నించగా, సాధారణంగా చెబుతున్నానని, ఎవరినీ ఉద్దేశించి కాదని అన్నారు. ఈ వ్యవహారంలో తమది కేవలం ప్రేక్షక పాత్ర మాత్రమేనంటూ బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. కాంగ్రెస్, ఆందోళనకారులు కలసి ఉమ్మడి కమిటీని ఏర్పాటు చేసుకున్నారని, ఈ వ్యవహారాన్ని ప్రేక్షకుల మాదిరిగా గమనిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు.