దుబాయిలో గాయని చిత్ర కూతురు దుర్మరణం

దుబాయిలో గాయని చిత్ర కూతురు దుర్మరణం

తిరువనంతపురం: ప్రముఖ గాయని చిత్ర కుమార్తె నందన (8) గురువారం దుబాయిలోని ఒక స్విమ్మింగ్ పూల్‌లో మునిగిపోయి దుర్మరణం చెందింది. ఎమిరేట్స్ హిల్స్‌లోని ఒక భవంతిలో ఉన్న స్విమ్మింగ్‌పూల్‌లో ఆమె మృతదేహం లభించినట్లు చిత్ర కుటుంబానికి సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆమెను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. షార్జాలో జరగనున్న ఎ.ఆర్.రెహమాన్ సంగీత ప్రదర్శనలో పాల్గొనేందుకు చిత్ర కూతురితో కలసి వెళ్లగా, అనుకోకుండా ఈ దుర్ఘటన జరిగింది. నందన చెన్నైలోని ఒక ప్రైవేటు పాఠశాలలో చదువుకుంటోంది. చిత్ర, విజయశంకర్ దంపతులకు వివాహమైన 15 ఏళ్ల తర్వాత ఈ పాప పుట్టింది. అందుకే ఆమెను అల్లారుముద్దుగా పెంచుకున్నారు. సినీ పరిశ్రమకు చెందిన పలువురు తమ సంతాపం తెలియజేశారు.