వివాదాలు ‘లోక్‌పాల్’ను అడ్డుకోలేవు
న్యూఢిల్లీ: లోక్‌పాల్ ముసాయిదా బిల్లు కమిటీలోని పౌరసమాజ సభ్యులను చుట్టుముట్టిన వివాదాలు కమిటీ పనికి ఆటంకం కలిగించవని ప్రభుత్వం స్పష్టం చేసింది. అవినీతి నిర్మూలన కోసం శక్తిమంతమైన చట్టాన్ని తయారు చేసేందుకు కమిటీ సభ్యులతో కలిసి పనిచేస్తామని చెప్పింది. శుక్రవారమిక్కడ జరిగిన కాంగ్రెస్ కోర్ గ్రూప్ భేటీలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి, కమిటీ అధ్యక్షుడు ప్రణబ్ ముఖర్జీ ఈ విషయం తెలిపారు. గంటన్నరపాటు జరిగిన భేటీలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. వీరు లోక్‌పాల్ కమిటీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించుకున్నారు. భేటీ తర్వాత ప్రణబ్ విలేకర్లతో మాట్లాడారు. ‘లోక్‌పాల్ బిల్లు కమిటీలోని సభ్యుల గురించి వివాదాలు వస్తున్నాయి.
అయితే ఇవి కమిటీ పనిని ప్రభావితం చేయవని ప్రభుత్వం, కాంగ్రెస్ భావిస్తున్నాయని నేను స్పష్టం చేస్తున్నా. కమిటీలోని ప్రభుత్వ ప్రతినిధు లు అందులో సభ్యులైన అన్నా హజారే, ఆయన సహచరులతో కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉన్నారు. బలమైన లోక్‌పాల్ బిల్లును తయారు చేయాలనే సంకల్పంతో ఉన్నారు’ అని తెలిపారు. లోక్‌పాల్ కమిటీలోని పౌరసమాజ ప్రతినిధులపై దుష్ర్పచారాన్ని తాము సమర్థించబోమని సోనియా గాంధీ ఇటీవల అన్నా హజారేకు లేఖ రాసిన నేపథ్యంలో కాంగ్రెస్ కోర్ గ్రూప్ సమావేశం జరిగింది.
లోక్‌పాల్ కమిటీ పనిని ప్రభుత్వం అడ్డుకోదు: దిగ్విజయ్
లోక్‌పాల్ ముసాయిదా బిల్లు కమిటీ పనికి కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్‌లు ఆటంకాలు కల్పించవని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. కమిటీలోని పౌర సమాజ ప్రతినిధులపై జరుగుతున్న బురదజల్లుడు ప్రచారంతో ప్రభుత్వానికి కానీ, తమ పార్టీకి కానీ ఎలాంటి సంబంధమూలేదని చెప్పుకొచ్చారు. కమిటీ సహాధ్యక్షుడు శాంతిభూషణ్, సభ్యులు ప్రశాంత్‌భూషణ్, సంతోష్ హెగ్డేలపై కొన్ని రోజుల నుంచి విమర్శలు చే స్తున్న దిగ్విజయ్ శుక్రవారమిక్కడ విలేకర్లతో మాట్లాడారు. కమిటీలో భూషణ్‌లు కొనసాగడంపై తనకు అభ్యంతరమేదీ లేదని, అయితే ఈ విషయంలో నిర్ణయాన్ని వారికే వదిలేస్తున్నానని వ్యాఖ్యానించారు. పౌరసమాజ ప్రతినిధులపై తొలుత విమర్శలు చేసింది కాంగ్రెస్ కాదని, బాబా రామ్‌దేవ్ అని అన్నారు.
అలహాబాద్‌లో బంగ్లా కొనుగోలుకు సంబంధించి తగినంత స్టాంప్ డ్యూటీ కట్టలేదని భూషణ్‌లకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నోటీసు ఇచ్చిందన్నారు. నోయిడాలో వారికి కేటాయించిన ఫామ్‌హౌస్ స్థలాల గురించి కూడా మీడియానే బయటపెట్టిందని అన్నారు. అవినీతి కేసులు ఎదుర్కొంటున్న కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పను ఆ రాష్ట్ర లోకాయుక్త సంతోష్ హెగ్డే కాపాడుతున్నారని తానెప్పుడూ అనలేదని చెప్పారు. ‘ప్రజలు ఎన్నుకున్న ప్రధాని, ముఖ్యమంత్రుల భవితవ్యాన్ని ప్రజలకు బాధ్యత వహించని వ్యక్తి, లేదా బృందానికి వదిలేయమంటారా?’ అని లోక్‌పాల్, లోకాయుక్తలను ప్రస్తావిస్తూ వ్యాఖ్యానించారు. తాను చెప్పేవన్నీ తమ పార్టీ అభిప్రాయాలేనన్నారు. కాగా, అక్రమ భూ కేటాయింపుల కేసులో నిందితుడైన దిగ్విజయ్‌కు.. అవినీతిపై మాట్లాడే హక్కే లేదని బీజేపీ వ్యాఖ్యానించింది.







