ఆస్ట్రేలియాలో మహిళలు డిఫరెంట్
‘‘మీ అభిమాన హీరో ఎవరు?’’ అని జెనీలియాని అడిగితే - ‘‘ఏ ఒక్క హీరో పేరునో చెప్పలేను. ఏ సినిమా బాగుంటే ఆ సినిమాలోని హీరో నచ్చుతాడు’’ అని చెప్పారు. పోనీ హీరోల్లో మీ ఫేవరెట్ కో-స్టార్ ఎవరో చెబుతారా? అన్నప్పుడు - ‘‘అందరు హీరోలు నాతో స్నేహంగా ఉంటారు. షూటింగ్ స్పాట్‌లో ఇప్పటివరకు నాకెలాంటి చేదు అనుభవాలు ఎదురు కాలేదు. కాబట్టి హీరోలందరూ నా ఫేవరెట్‌లే’’ అన్నారు. ఈ క్యూట్ గాళ్ పైకి అమాయకురాలిలా కనిపించినా చాలా తెలివిగల అమ్మాయని ఈ సమాధానాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం రెండు పదుల వయసులో ఉన్న జెన్నీని నాలుగు పదుల వయసుకి చేరుకున్నప్పుడు.. ఆ వయసు కనిపించకుండా శస్త్ర చికిత్సల్లాంటివి ఏమైనా చేయించుకుంటారా? అని అడిగితే - ‘‘కాస్మటిక్ సర్జరీలపై నాకు నమ్మకం లేదు. మన భారతీయులు వయసు మీద పడితే చాలు అందం తరిగిపోతుందనుకుంటారు. కానీ విదేశాల్లో అలా కాదు. హాలీవుడ్ గురించి చెప్పుకుంటే అక్కడ నాలుగు, ఐదు పదుల వయసులో ఉన్న మహిళలు కూడా కథానాయికలుగా నటిస్తున్నారు. సినిమాల్లో కురచ దుస్తులు ధరించి కురక్రారుని సైతం ఆకట్టుకుంటున్నారు. అంతెందుకు? ఆస్ట్రేలియా వీధుల్లో వయసు పైబడిన మహిళలు సినిమా స్టార్‌లను తలపించే రేంజ్‌లో అగుపించి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటారు. వయసు శరీరానికే గానీ మనసుకి కాదని వాళ్లు ఆ రకంగా నిరూపిస్తున్నారు. కానీ మన పరిస్థితి ఇలా ఉండదు. జస్ట్ 30ఏళ్లు వస్తే చాలు.. ముసలమ్మలనేస్తారు. అది సరి కాదు’’ అన్నారు.