తెలంగాణా ఉత్తర కోస్తాల్లో అకాల వర్షాలు: భారీ పంటనష్టం
మండుటెండల్లో ఉరుములు మెరుపులతో వచ్చిన వాన చల్లదనాన్ని ఇచ్చినట్లే ఇచ్చి రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. వడగండ్ల వానతో తెలంగాణా ఉత్తర కోస్తా జిల్లాల్లోని రైతులు తీవ్రంగా నష్టపోయారు.
వేల ఎకరాల్లో ధాన్యం కల్లాల్లోనే తడిసి ముద్దయింది. రాత్రికి రాత్రే వర్షం ముంచెత్తడంతో ధాన్యాన్ని ఇంటికి తరలించే అవకాశం కూడా లేకపోయింది. ఇంకోవైపు దాళ్వా వరిసాగు చేస్తున్న రైతుల నోట మట్టికొట్టింది ఈ అకాల వర్షం. చేతికి వచ్చిన పంట వానదెబ్బకు నాశనమైంది.
మామిడి, మొక్కజొన్న... ఇతర మెట్ట పంటలు సైతం తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఒక్క కృష్ణా జిల్లాలోనే 98 వేల ఎకరాల్లో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. 25 వేల ఎకరాల్లో మిర్చి పంట మట్టిపాలైంది. వడగండ్ల వానతో చేతికి వచ్చిన మామిడి నేలపాలైంది.
రాష్ట్రంపై ఉపరితల ఆవర్తన ద్రోణి విస్తరించి ఉండటంతో మరో 48 గంటలు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. ఆరుగాలం శ్రమించి, అప్పులు తీసుకువచ్చి పండించిన పంట చేతికి అందకపోతే దిక్కేమిటని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తక్షణం సహాయం చేయాలని వారు కోరుతున్నారు.