దూసుకుపోతున్న విజయమ్మ: దిక్కుతోచని వివేకానంద

దూసుకుపోతున్న విజయమ్మ: దిక్కుతోచని వివేకానంద


పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఇక్కడ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న వైఎస్.విజయలక్ష్మీ ప్రచారంలో తారాజువ్వలా దూసుకెళుతున్నారు. ఆమెపై పోటీకి దిగిన వైఎస్.వివేకానంద రెడ్డి ఏం చేయలో దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్నారు.

ఈ రెండు స్థానాలకు అనివార్య పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతున్న విషయం తెల్సిందే. అయితే, ఈ ఎన్నికలు పార్టీల మధ్య సమరంగా కాకుండా వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల మధ్యే జరుగుతున్నట్టుగా రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు భావిస్తున్నారు.

దీంతో ఇరు కుటుంబాల సభ్యులు విస్తృతంగా పులివెందుల నియోజకవర్గంలో ప్రచారం సాగిస్తున్నారు. వైఎస్ విజయమ్మ గెలుపు బాధ్యతను వైయస్ రాజశేఖర రెడ్డి కూతురు షర్మిళా రెడ్డి తన భుజాన వేసుకున్నారు. విజయమ్మ తరరపున వైఎస్ జగన్ భార్య భారతీ రెడ్డి, మామ గంగిరెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరులు మనోహర్ రెడ్డి, ఆనంద రెడ్డి ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నారు.

అలాగే, వైఎస్ వివేకానంద రెడ్డి తరపున ఆయన భార్య సౌభాగ్యమ్మ, ఆయన అల్లుడు, కూతురు మాత్రమే ప్రచారం చేస్తున్నారు. వైఎస్ కుటుంబ సభ్యులంతా విజయమ్మ, జగన్‌కు పూర్తిగా అండగా ఉండగా, వివేకానంద రెడ్డి కుటుంబం మాత్రం ఒంటరిగా మారిపోయింది.

పైపెచ్చు.. కార్యకర్తలు, ఓటర్లు సైతం వివేకా తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఓటర్లే వివేకాను నిలదీస్తూ.. ఇదేనా మీ న్యాయం అంటూ కడిగిపారేస్తున్నారు. ఈయన గెలుపుకోసం ఏకంగా ఏడుగురు మంత్రులు కడపలో మకాం వేసినప్పటికీ.. ప్రచారం ఏ విధంగా చేయాలన్ని అంశంపై ఇప్పటికీ ఒక నిర్ణయానికి రాలేక పోతున్నారు.