కలకలం రేపిన హరికృష్ణ లేఖ!

కలకలం రేపిన హరికృష్ణ లేఖ!


హైదరాబాద్ : నారా కుటుంబానికి, నందమూరి వంశానికి మధ్య కోల్డ్‌వార్ కొనసాగుతోంది. తాజాగా నందమూరి హరికృష్ణ శనివారం విడుదల చేసిన లేఖ టీడీపీలో కలకలం రేపింది. అన్నాహజారేకు మద్దతుగా చంద్రబాబునాయుడు చేపట్టిన ర్యాలీలో హరికృష్ణ పాల్గొనకుండా అదే సమయంలో ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేయటం చర్చనీయాంశం అయ్యింది. ఆ లేఖలో హరికృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవినీతిపై రాజీలేని పోరాటం చేసిన ఎన్‌టీఆర్ ఆశయాల కోసం త్వరలో మీముందుకు వస్తున్నా ఆశీర్వదించండంటూ హరికృష్ణ ఆ లేఖలో పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఆశయాల పరిరక్షణ కోసం తాను పోరాడతానని తెలిపారు. కుంట భూమి లేనివారు కూడా కోట్లాది రూపాయలు సంపాదించారని హరికృష్ణ తన లేఖలో వ్యాఖ్యలు చేశారు. స్విస్ బ్యాంకుల్లో ఉన్న ఖాతాలను వెలికి తీయాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు ర్యాలీలో హరికృష్ణ అనుచరులు ఈ లేఖ పత్రులను పంచారు.