మీ ఓటు రాజకీయాల్నే మార్చాలి


మీ ఓటు రాజకీయాల్నే మార్చాలి

వేముల (వైఎస్సార్ జిల్లా), న్యూస్‌లైన్ ప్రతినిధి:‘ కడప లోక్‌సభ పరిధిలోని ప్రజల ఓటు రాష్ర్ట రాజకీయాల్ని మార్చే బ్రహ్మాస్త్రం కావాలి. ప్రతి పేద వాడి ముఖంలో చిరునవ్వు చూడాలనే లక్ష్యంతో దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పాదాలచెంత పుట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్‌సభ అభ్యర్థి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. పులివెందుల అసెంబ్లీ పరిధిలోని వేముల మండలం గొందిపల్లె, వేముల గ్రామాల్లో శనివారం ఆయన రోడ్ షో జరిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు.. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు రాజకీయ అవసరం వచ్చినా దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డిని కీర్తిస్తాయుని చెప్పారు. అవసరం తీరాక ప్రతిపక్షంతో సైతం కుమ్మక్కై ఆయనమీద బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నాయుని విమర్శించారు.

ఈ ఎన్నికలు వైఎస్‌కు సోనియాకు, కడపకు ఢిల్లీకి మధ్యే జరుగుతున్నాయని ఆయన మరోసారి చెప్పారు. వైఎస్ మరణం తర్వాత రాష్ట్రంలో ఏ రాజకీయపార్టీ నాయకుడు కూడా ప్రజలకు దగ్గర కావాలని, వారి సమస్యల్లో మమేకం కావాలనే ఆలోచనతో, ఆశయంతో పనిచేయడం లేదని జగన్ విమర్శించారు. పాలకపక్షం, ప్రతిపక్షం చేతులు కలిపి ప్రజా సమస్యలను గాలికొదిలేసి రాజకీయ అస్థిత్వం కోసం పాకులాడుతున్నాయని ధ్వజమెత్తారు. ఇందులో భాగంగానే ఆ రెండు పార్టీలు అసెం బ్లీలో పదిరోజుల పాటు రాజకీయ డ్రామా నడిపి వైఎస్ హయాంలో క్యాబినెట్ సమష్టిగా తీసుకున్న నిర్ణయాలపై హౌస్‌కమిటీ వేశాయని విమర్శించారు.

కాంగ్రెస్ తన రాజకీయ అవసరాల కోసం తమ కుటుంబాన్ని నిలువునా చీల్చి తల్లిలాంటి వదిన విజయలక్ష్మి మీద మరిది వివేకానందరెడ్డిని పోటీ చేయిస్తోందని ఆవేదన చెందారు. ఇలాంటి నీచమైన పార్టీ కోసమా వైఎస్ పాదయాత్ర చేసింది? ఇలాంటి పార్టీనా రెండుసార్లు ఆయున అధికారంలోకి తెచ్చింది అని జగన్ ప్రశ్నించారు. ప్రతి పేదకుటుంబం ఉన్నత స్థానానికి చేరాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ఏ సీఎం ఆలోచించని విధంగా.. దేశంలో సోనియా కూడా ఆలోచించని విధంగా వైఎస్ పావలావడ్డీ, ఉచిత ఉన్నత విద్య,మహిళలకు పావలా వడ్డీ రుణాలు, ఆరోగ్యశ్రీ, 108 పథకాల గురించి ఆలోచించి అమలు చేశారన్నారు. దివంగత వైఎస్ శ్రమవల్లే కేంద్రం లో రెండుసార్లు కాంగ్రెస్ సారథ్యంలోని ప్రభుత్వం ఏర్పడిం దన్నారు. మాజీ మంత్రి కొండా సురేఖ తదితరులు ఈ రోడ్ షోలో పాల్గొన్నారు.

మన్నించండి..
గొందిపల్లెకి మూడురోజుల కిందటే రావాల్సి ఉందని.. సమ యం మీరి పోవడం, ఎన్నికల కోడ్ కారణంగా రాలేక పోయానని వైఎస్ జగన్ చెప్పారు. ఆ రోజు రానందుకు క్షమించాలని ఆయన గొందిపల్లె ప్రజలను కోరారు. శనివారం సాయంత్రం రోడ్ షోకు వచ్చిన జగన్‌కు గ్రామ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పిల్లలు, యువకులు రథం వెంట పరుగులు తీసి అభివాదం చేశారు. రోడ్‌షో సందర్భంగా పలువురు టీడీపీ నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.