కొత్త పార్టీ వస్తోంది ?

కొత్త పార్టీ వస్తోంది ?
 సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లన్న నినాదంతో బడుగు, బలహీనవర్గాల మది గెలుచుకుని, రాష్ట్రంలో అధికారాన్ని సొంతం చేసుకున్న తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత ఎన్టీఆర్‌ వారసత్వాన్ని అడ్డుపెట్టుకుని ఆయన మనుమడు జూనియర్‌ ఎన్టీఆర్‌తో కొత్త పార్టీ పెట్టించేందుకు కేంద్రమంత్రి పురంధేశ్వరి కొత్త వ్యూహానికి తెరలేపనున్నారు. చిరంజీవి, జగన్‌ను ఆదర్శంగా చూపిస్తూ ఎన్టీఆర్‌తో సొంత పార్టీ పెట్టించి, టీడీపీని దెబ్బతీసేందుకు పురంధేశ్వరి వ్యూహబృందం రాజకీయ ఎత్తుగడకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. గతంలో చిరంజీవి రాజకీయ రంగ్ర పవేశం చేయనున్నారని ‘సూర్య’ దినపత్రిక అందరికంటే ముందుగా చెప్పిన విషయం తెలిసిందే.

అదేవిధంగా ఆయన పార్టీ స్థాపించారు. ఆ తర్వాత చిరు తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయనున్నారని కూడా ‘సూర్య’ ముందే చెప్పింది. అది కూడా నిజమయింది. జగన్‌ కొత్త పార్టీ స్థాపించ నున్నారని వైఎస్‌ మృతి చెందిన కొద్ది నెలలకే ‘సూర్య’ వెల్లడించింది. అదే విధంగా జగన్‌ కొత్త పార్టీని స్థాపించిన విషయాన్ని విస్మరించకూడదు. టీడీపీని భూస్థాపితం చేసేం దుకు పురంధేశ్వరి కొత్త ఎత్తుకు తెరలేపారన్న ‘సూర్య’ కథనాన్ని మిగిలిన పత్రికలు, మీడియా ఆ తర్వాత అనుసరిస్తున్న విషయం తెలిసిందే. విశ్వసనీయ సమాచారం ప్రకారం... చంద్రబాబునాయుడు ఆధ్వర్యం లోని తెలుగుదేశం పార్టీని చీల్చడం ద్వారా కాంగ్రెస్‌లో తన పలుకుబడి, రాజకీయ లక్ష్యాన్ని సాధించుకునేందుకు ప్రయత్నిస్తున్న పురంధేశ్వరి.. తాజాగా జూనియర్‌ ఎన్టీఆర్‌ తో కొత్త పార్టీని స్థాపించేలా ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. జూనియర్‌ వయసు, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. రాజకీయ రంగ ప్రవేశానికి సమయం, సందర్భం లేదన్న వాదన వినిపిస్తోంది. అదే విషయాన్ని హరికృష్ణ, ఎన్టీఆర్‌ సన్నిహితులు పురంధేశ్వరి వద్ద ప్రస్తావించినట్లు చెబుతున్నారు.

అయితే.. ఆమె వారి వాదనలను త్రోసిపుచ్చి, చిరంజీవి, జగన్‌కు సంబంధించిన వ్యవహారాలను నిదర్శనంగా చెప్పినట్లు సమాచారం. జగన్‌ కూడా చిన్న వయసులోనే ఎంపీ అయి, సొంత పార్టీ స్థాపించారని, ఇప్పుడు కాంగ్రెస్‌ను ఢీకొట్టే స్థాయికి చేరారని ఆమె వివరించారు. జగన్‌ కూడా వైఎస్‌ కార్డుతోనే ఈ స్థాయికి చేరారని, రాజకీయాల్లో జగన్‌కు తండ్రి పేరు ఉపయోగపడుతోందని నచ్చచెబుతున్నారు. అదే విధంగా, సొంత పార్టీ పెట్టిన చిరంజీవికి సినిమా గ్లామర్‌ బాగా కలసి వచ్చిందని వివరిస్తున్నారు. అదేవిధంగా ఎన్టీఆర్‌కూ సినీ గ్లామర్‌ కలసి వస్తుందని చెబుతున్నారు. సొంత పార్టీ పెట్టిన చిరంజీవి ఇప్పుడు తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి, నేరుగా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సమావేశమయ్యే స్థాయికి ఎదిగిన వైనాన్ని సోదరులకు ఆమె వివరించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఎన్టీఆర్‌కు సినీ గ్లామర్‌తో పాటు, తాత ఎన్టీఆర్‌ పోలికలు, తాత స్థాయిలో అనర్గళంగా ప్రసంగించే చాతుర్యం దండిగా ఉన్నందున, రాజకీయ ప్రవేశానికిదే తగిన సమయమని పురంధేశ్వరి నచ్చచెబుతున్నట్లు తెలుస్తోంది. సొంత పార్టీ పెడితే ఎన్టీఆర్‌ సీఎం కూడా కావచ్చని, టీడీపీ వర్గాలన్నీ ఎన్టీఆర్‌నే సమర్థిస్తారని చెబుతున్నారు. అదీగాక, జూనియర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్న సినిమాలు ఇటీవలి కాలంలో ఫ్లాప్‌ అవుతుండటం, ఇంకా యువ హీరోలకు ఆదరణ పెరుగుతుండటం వల్ల ఇక ఆయన సినిమాలకు స్వస్థి చెప్పి, పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారి, పార్టీ స్థాపించాలని ఆమె ఒత్తిడి చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. రెండున్నరేళ్లలో ఎన్నికలు ఉన్నందున... ఇప్పటినుంచే ఎన్టీఆర్‌ క్రియాశీల రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించి ప్రజలకు దగ్గరయితే, కొత్త పార్టీ పెట్టిన తర్వాత ఆదరణ పెరుగుతుందని ఆమె నచ్చచెప్పే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్‌కు కొంచెం భిన్నంగా ... ముందు రాష్టమ్రంతా పర్యటించి, సరిగ్గా ఎన్నికలకు తొమ్మిది నెలల ముందు కొత్త పార్టీ ప్రకటించి, టీడీపీని దెబ్బతీయాలని హరికృష్ణకు ఆమె సూచిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

టీడీపీని దెబ్బతీయడంతో పాటు.. జూనియర్‌ ఎన్టీఆర్‌ పెట్టిన పార్టీతో కాంగ్రెస్‌కు పొత్తు కలపాలన్నది కూడా పురంధేశ్వరి మరో లక్ష్యమని చెబుతున్నారు. దాని ద్వారా.. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి రానీయకుండా అడ్డుపడాలన్నది ఆమె భావనగా కనిపిస్తోందంటున్నారు.ఇదిలాఉండగా, ఎన్టీఆర్‌ కొత్త పార్టీ పెట్టిన తర్వాత... కొన్నాళ్లకు ఆ పార్టీ పగ్గాలను తాను గానీ, ఒక బీసీ నేతకు గానీ అప్పగించాలని పురంధేశ్వరి యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్టీఆర్‌ను కొత్త పార్టీ స్థాపించే వరకూ ఆయనను ప్రోత్సహించి, ఆ తర్వాత క్రమంగా ఆయనను తప్పించి తాను పగ్గాలు అందుకోవాలన్నది ఆమె లక్ష్యమని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇందుకు దగ్గుబాటి వ్యూహబృందం ఇప్పటికే హరికృష్ణను ప్రోత్సహిస్తోందని చెబుతున్నారు. విశాఖకు చెందిన ఓ కేంద్రస్థాయి ఛైర్మన్‌ హోదాలో ఉన్న ఓ లాబీయిస్టు కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.ఆయన మీడియాలోని ప్రముఖుల అండతో పురంధేశ్వరికి అనుకూలంగా లాబీ తయారుచేసి, టీడీపీకి వ్యతిరేకంగా వార్తా కథనాలు వచ్చేలా లాబీయింగ్‌ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాజకీయ, మీడియా, పారిశ్రామిక వర్గాలకు అత్యంత సన్నిహితంగా వ్యవహరించే ఆయనకు దగ్గుబాటి అండ కూడా ఉండటంతో, మీడియాను తనకు అనుకూలంగా మలచుకునే వ్యూహానికి తెరలేపినట్లు తెలుస్తోంది.