జగన్‌పై గెలవడం కష్టం కానీ..... మెజారిటీ తగ్గిద్దాం!!

జగన్‌పై గెలవడం కష్టం కానీ..... మెజారిటీ తగ్గిద్దాం!

 కడప లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్న దానిపై రాష్ట్ర ప్రజలే కాకుండా దేశ ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. నిజానికి ఇక్కడ జరుగుతున్నది ఉప ఎన్నికలు అని అనుకుంటే పొరపాటే. ఈ దేశ రాజకీయాలను తన కనుసన్నలతో శాసిస్తూ దేశ పాలనా పగ్గాలను నడిపిస్తున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కాలిగోటితో సమానంగా భావించిన యువనేత వైఎస్.జగన్మోహన్ రెడ్డికి మధ్య జరుగుతున్న ప్రత్యక్ష రాజకీయ సమరంగా అభివర్ణించవచ్చు.

అందుకే జగన్‌కు ఎలాగైనా చెక్ పెట్టాలన్న ఏకైక పట్టుదలతో అధికార కాంగ్రెస్‌ పావులు కదుపుతోంది. రాష్ట్ర కేబినెట్‌కు చెందిన సగంమంది మంత్రులు కడపలో తిష్టవేశారు. ఒక్కో నియోజకవర్గం బాధ్యతలు చేపట్టారు. వీరితో పాటు మాజీ ముఖ్యమంత్రి కె.రోశయ్య, ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్, ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిలు ఉన్నారు.

అంతేకాకుండా, కేంద్రమంత్రులు, స్థానిక జిల్లా నేతలు ఇలా అనేక మంది పేరున్న నేతలు జగన్‌పై ఎన్నికల సమరభేరీ మోగించారు. అయినా.. జగన్‌ను ఢీకొట్టడం అంత సులభం కాదని వారే చెపుతున్నారు. అందుకే కనీసం గెలుపు మాట అటుంచి మెజారిటీ తగ్గించేందుకు వీరంతా వ్యూహాలు రచిస్తున్నారు.

యేడాదిన్నరపాటు కడప పార్లమెంటు సభ్యుడిగా ఉన్న జగన్ ప్రజల మధ్యకు వెళ్లిన దాఖలాలు లేవు. కానీ, ఎన్నికల ప్రచారంలో ఆయనకు లభిస్తున్న ఆదరణ చూస్తుంటే తన తండ్రి వైఎస్ఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచి పోవడం వల్లనేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

దీనికితోడు కుటుంబ వారసత్వంగా వచ్చిన ప్రజాబలం కలిగిన జగన్‌ను అధికార పార్టీ ఎదుర్కోవడం కష్టంగా మారింది. జగన్‌ను ఎదుర్కోవడానికి అధికార కాంగ్రెస్ నియోజకవర్గానికో మంత్రితో కలిపి మొత్తంగా పన్నెండు మంది మంత్రులను రంగంలోకి దింపింది. అంతేకాకుండా ఏ నియోజకవర్గంలో ఏ సామాజిక వర్గం ఎక్కువ ఉందో చూసుకొని మరీ ఆ మంత్రిని ఆ నియోజకవర్గంలో నియమించింది.

ఇక కడప పార్లమెంటుకు పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి డిఎల్ రవీంద్రారెడ్డి అయితే అహర్నిశలు కష్టపడుతున్నారు. వైఎస్ కుటుంబం ఇన్నాళ్లు రిగ్గింగులకు పాల్పడిందని, అక్రమాలు చేసిందన్న ప్రతిపక్షాల ఆరోపణలు ప్రజలలోకి వెళితే సాంప్రదాయ ఓటు డీఎల్‌కు పడితే గెలిచే అవకాశాలు లేక పోలేదని కూడా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ, ప్రస్తుతం నెలకొన్న రాష్ట్ర రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అది అంత సులభమయ్యేలా లేదు.

కారణం... 37 యేళ్ళ యువనేత జగన్.. కొండలాంటి సోనియాను ఢీకొట్టడమే. ఇది ప్రజల మనస్సులో బాగా నాటుకుని పోయింది. ఒకరి మోచేతి నీళ్లు తాగుతూ.. ఒకరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడం కంటే మన బతుకులు మనమే బాగు చేసుకుందామన్న ధోరణితో జగన్ ఎన్నికల ప్రచారం సాగిస్తుండటం ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తోంది. పైపెచ్చు.. సోనియా వల్ల రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని ఆయన పూసగుచ్చినట్టు వివరిస్తున్నారు.

33 మంది ఎంపీలను అందించినప్పటికీ రాష్ట్రంపై ఆమె పక్షపాత ధోరణితోనే వ్యవహరిస్తున్నారన్నది జగన్ ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణకు అనుగుణంగానే ఆమె వ్యవహారశైలీ ఉంది. దీన్ని క్యాష్ చేసుకోవడం ద్వారా చేసుకుని తన సత్తా చాటేందుకు ఉప ఎన్నికల అస్త్రాన్ని ప్రయోగించారు. దీనికి కాంగ్రెస్ అధిష్టానంతో పాటు.. రాష్ట్ర ప్రభుత్వం కుదేలైపోతోంది. ఎలాగైనా తమ పరువు కాపాడుకునేందుకుగాను కనీసం జగన్‌ మెజారిటీ తగ్గించేందుకు ముమ్మర కృషి చేస్తోంది. మరి వారి కృషి ఫలిస్తుందో లేదో చూడాలి.