రామోజీ క్షమాపణ

 రామోజీ క్షమాపణ

కన్నడ టీవీ సీరియల్‌పై కర్ణాటక హైకోర్టు సీరియస్
భాష తెలియకుంటే చానలెందుకు పెట్టారని ప్రశ్న
కోర్టు దృష్టిలో అందరూ సమానమే.. వ్యాపారంలో బిజీగా ఉంటే కోర్టుకు రారా?
కోర్టు వ్యవహారాల్లో ఆషామాషీగా వ్యవహరించొద్దు
షరతులతో కూడిన మీ క్షమాపణలు మాకక్కర్లేదు విచారణ జరిగి తీరాల్సిందే


బెంగళూరు, న్యూస్‌లైన్: కోర్టులను కించపరిచే విధంగా టీవీ సీరియల్‌ను నిర్మించిన ‘ఈనాడు’ అధిపతి రామోజీరావుకు కర్ణాటక హైకోర్టు గట్టిగా అక్షింతలు వేసింది. తనకు కన్నడ భాష తెలియదని, అందుకే ఆ సీరియల్‌లో ఏముందో గ్రహించలేదని రామోజీ చేసిన వాదనలపై మండిపడ్డ కోర్టు.. భాష తెలియనప్పుడు చానలెందుకు పెట్టారు అంటూ ప్రశ్నించింది. కోర్టు వ్యవహారాల్లో ఆషామాషీగా వ్యవహరించవద్దని హెచ్చరించింది.
రామోజీ నిర్మించిన ‘ముక్త ముక్త’ అనే కన్నడ టెలీ సీరియల్‌ను కోర్టులను అవమాన పరచే విధంగా చిత్రీకరించారని.. కించపరిచే వ్యాఖ్యానాలు చేశారంటూ జీఆర్ మోహన్ అనే న్యాయవాది కోర్టు ధిక్కారం కింద రామోజీతో పాటు ఆ సీరియల్ రచయిత, దర్శకుడు టీఎన్ సీతారాంపై క్రిమినల్ కేసు దాఖలు చేశారు. 2008 నుంచి ఈ విచారణ జరుగుతోంది. ఒక్క వాయిదాకూ రామోజీ హాజరు కాలేదు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తులు అజిత్ జే గుంజల్, సీఆర్ కుమారస్వామిలతో కూడిన డివిజన్ బెంచ్ గత శుక్రవారం వారిద్దరిపై బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. దీంతో రామోజీ, సీతారాంలు మంగళవారం విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తనకు కన్నడ భాష తెలియదని రామోజీ చెప్పడంతో భాష తెలియనప్పుడు చానల్‌ను ఎందుకు పెట్టారని కోర్టు ప్రశ్నించింది. కోర్టు వాయిదాలకు హాజరు కాకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. వయో భారం, వ్యాపార లావాదేవీలు అంటూ కోర్టుకు హాజరు కాకపోవడాన్ని నిలదీసింది. కోర్టు ఎదుట అందరూ సమానమేనని తేల్చి చెప్పింది.

అనంతరం రామోజీతో పాటు సీతారాం షరతులతో కూడిన క్షమాపణలు చెప్పడానికి సిద్ధమయ్యారు. దీనిని స్వీకరించడానికి కోర్టు నిరాకరించింది. విచారణ జరిగి తీరాల్సిందేనని తేల్చి చెప్పింది. ఇరువైపులా ఏవైనా అభ్యంతరాలుంటే రెండు వారాల్లోగా వాటిని దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వచ్చే నెల 24వ తేదీకి వాయిదా వేసింది.