ఎదుర్కోవడానికి నీచ రాజకీయాలు: వైఎస్ జగన్
ప్రొద్దుటూరు: కడప లోకసభ నియోజకవర్గం, పులివెందుల అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఇద్దరిని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ నీచమైన కుయుక్తుల్ని పన్నుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ప్రచారంలో భాగంగా ప్రొద్దుటూరు పట్టణంలో ప్రజల్ని ఉద్దేశించి జననేత ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మమల్ని ఎదుర్కోవడానికి జిల్లాలో 10 మంది మంత్రులు... వారితో పనిచేయించడానికి హైదరాబాద్‌లో నలుగురు వ్యక్తులు పర్యవేక్షిస్తున్నారని జగన్ తెలిపారు. అయితే ఈ పద్నాలుగు మందిపై ఓ కేంద్రమంత్రి ఆజమాయిషీ కొనసాగిస్తున్నారని జగన్ వెల్లడించారు.
ఇంకా కడప లోకసభలో 10 మందిని, పులివెందులలో ఆరుగుర్ని జగన్, విజయమ్మ పేరుతో పోటీకి నిలిపి నీచమైన రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ నడుపుతోందని జగన్ విమర్శించారు. ఈ రెండు నియోజకవర్గాలో సుమారు 6500 మందిపై బైండోవర్ కేసుల్ని పెట్టారని ఆయన తెలిపారు. అయితే ఇన్ని జరిగినా భగవంతుడు, తండ్రి వైఎస్‌ఆర్‌తోపాటు మహానేతను ప్రేమించే ప్రతి గుండె చప్పుడు తమ వెంటే వుందని జగన్ స్పష్టం చేశారు.