సత్యసాయి బాబా ఆదివారం తుదిశ్వాస విడిచారు
పుట్టపర్తి: భగవాన్ సత్యసాయి బాబా ఆదివారం తుదిశ్వాస విడిచారు. భౌతికంగా ఆయన భక్తులకు దూరమయ్యారు. ఈ ఉదయం 7.40 నిమిషాలకు సత్యసాయి బాబా దేహాన్ని వదిలి వెళ్లినట్టు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ అధికారికంగా ప్రకటించింది. ఉత్తరాయణం వసంత రుతువు చైత్ర బహుళ సప్తమి ఉత్తరాఢ నక్షత్రం నిర్యాణం చెందారని తెలపింది. గత 28 రోజులుగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాబా ఈ రోజు లోకాన్ని విడి చారు. కార్డియో వాస్కులర్ ఫెయిల్యూర్‌తో మరణించినట్టు ట్రస్ట్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. బాబా భౌతిక కాయాన్ని భక్తులు దర్శించుకునేందుకు వీలుగా సాయి కుల్వంత్ ఉంచనున్నట్టు ఏర్పాట్లు తెలిపింది. సాయంత్రం 6 గంటల నుంచి బాబా భౌతిక దేహాన్ని దర్శించుకోవచ్చని తెలిపింది. బాబా మరణంతో పుట్టపర్తిలో విషాద వాతావరణం నెలకొంది.
అనంతపురం జిల్లా పుట్టపర్తిలో పెద్ద వెంకమ రాజు రత్నాకరం దంపతులకు 1926 నవంబర్ 23న బాబా జన్మించారు. ఆయన అసలు పేరు సత్యనారాయణ రాజు.