నేడు సచిన్ టెండూల్కర్‌ 38వ పుట్టినరోజు

నేడు సచిన్ టెండూల్కర్‌ 38వ పుట్టినరోజు

ప్రతి ఒక్కరికీ పుట్టినరోజులు చాలా వస్తాయి. కానీ జీవితంలో మరచిపోలేని పుట్టిన రోజు ఒకటుంటుంది. నేడు సచిన్ టెండూల్కర్‌కూ అలాంటి రోజే.గత 38 సంవత్సరాలలో ఎన్నడూ లేనంత హడావుడి ఈసారి ఏర్పడింది. కారణం... తన ప్రపంచకప్ కలను నెరవేర్చుకున్న తర్వాత వచ్చిన మొదటి వేడుక ఇది. అందుకే మొత్తం దేశం అతడి జన్మదినం కోసం ఆసక్తికరంగా ఎదురుచూసింది. అయితే తాను ఆరాధించే పుట్టపర్తి సాయిబాబా అనారోగ్యం కారణంగా మాస్టర్ ఈసారి పెద్దగా వేడుకలు జరుపుకోవడం లేదు. కానీ మాస్టర్‌ను అభిమానించే కోట్లాదిమంది నేడు సంబరాలు చేసుకుంటున్నారు. సచిన్ క్రికెటర్‌గానే ఇంకా చాలా పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నారు. అభిమానులందరి తరఫునా క్రికెట్ దేవుడికి ‘హ్యాపీ బర్త్‌డే’.

క్రికెట్ స్పెషలిస్టు... రికార్డుల్లో ఎవరెస్టు... ప్రదర్శనలో బెస్ట్... అభిమానులకు దేవుడు... సహచరులకు ఆప్తుడు... ఆదర్శ వ్యక్తిత్వం... అబ్బురపరిచే ఆత్మవిశ్వాసం... ఎదిగినా ఒదిగే తత్వం... అన్నార్తులకు ఆపన్నహస్తం... మొత్తంగా అతనో అపురూప లక్షణాల సంగమం... విశ్వవిఖ్యాత క్రికెట్ విన్యాసం... అతని జీవిత గమనం విభిన్నం... విలక్షణం... విశిష్టం... ఇలా ఎన్ని చెప్పుకొన్నా ఏదో వెలితి... వర్ణించడానికీ పదాలు దొరకని ప్రత్యేక వ్యక్తి... క్రీడాశక్తి... సచిన్ టెండూల్కర్. విరామమెరుగక పరిశ్రమించే ఈ క్రికెట్ బాటసారి నేడు 39వ పడిలోకి అడుగుపెడుతున్నాడు. సచిన్‌కిది తన క్రీడా జీవితంలోనే అత్యంత మధురమైన పుట్టిన రోజు కానుంది. ఇంతకాలంగా ఎన్నో అనితర సాధ్యమైన రికార్డులను తన పేరిట లిఖించుకున్న ఈ క్రీడా దిగ్గజాన్ని ఇన్నేళ్లూ అందని ద్రాక్షలా ప్రపంచకప్ ఊరిస్తూ వచ్చింది. ఐదు సార్లు ప్రపంచకప్ టోర్నీ ఆడినప్పటికీ అది సాధించాలనే కోరిక మాత్రం తీరలేదు. కానీ ఆరోసారి అదీ భారత గడ్డపై జరిగిన ఫైనల్లో ఆ లోటూ తీర్చుకున్నాడు. జట్టు సహచరులు తమ అభిమానధనుడిని భుజాలపై ఎక్కించుకుని సమున్నత గౌరవాన్నిచ్చారు.

అయితే ఇన్ని విశేషాల మధ్య అంగరంగ వైభవంగా జరుపుకోవాల్సిన తన పుట్టిన రోజు వేడుకలకు సచిన్ దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నాడు. సాధారణంగా మ్యాచ్‌లు లేని రోజు బర్త్‌డే వస్తే మాస్టర్ కేవలం తన కుటుంబసభ్యులతో మాత్రమే గడుపుతుంటాడు. కానీ ఈసారి హైదరాబాద్‌లో డెక్కన్ చార్జర్స్‌తో మ్యాచ్ సందర్భంగా ఈ వేడుక వచ్చింది. దీంతో బాలీవుడ్, టాలీవుడ్, కార్పొరేట్ దిగ్గజాలతో భారీ పార్టీకి రంగం సిద్ధమైనప్పటికీ తను మాత్రం ఈ హంగామాను సున్నితంగా తిరస్కరించాడు. తానెంతో ఆరాధించే పుట్టపర్తి సత్యసాయిబాబా ఆరోగ్యం తీవ్రంగా విషమించడమే దీనికి కారణం. ఇలాంటి పరిస్థితిలో ఆడంబరాలెందుకని సచిన్ అభిప్రాయపడుతున్నాడు. 1989, నవంబర్ 15న అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో అరంగేట్రం చేసిన సచిన్ అటు టెస్టుల్లోనూ ఇటు వన్డేల్లోనూ అత్యధిక పరుగులు, సెంచరీలు సాధించిన ఆటగాడిగా వినతికెక్కాడు. గ్వాలియర్‌లో దక్షిణాఫ్రికాపై వన్డేలో తొలిసారి సాధించిన డబుల్ సెంచరీ ‘టైమ్స్’ మేగజైన్ టాప్ క్రీడా ఈవెంట్లలో ఒకటిగా నిలిచింది. బ్రియాన్ లారా సాధించిన టెస్టుల్లో అత్యధిక స్కోరు (400 నాటౌట్), ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యధిక స్కోరు (501 నాటౌట్) తప్ప మిగిలిన అన్ని రికార్డులను సచిన్ తన ఖాతాలో వేసుకున్నాడు.

సత్యసాయి ఆరోగ్యం కోసం ప్రార్థించండి

విషమంగా మారిన సత్యసాయిబాబా ఆరోగ్య పరిస్థితి కుదుటపడాలని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కోరుకున్నాడు. ‘సత్యసాయి త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. తనకు ఆయురారోగ్యాలు కలగాలని మీరు కూడా కోరుకుంటారని ఆశిస్తున్నాను’ అని భగవాన్‌కు భక్తుడైన సచిన్ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.

వికలాంగ సైనికులతో సచిన్ వేడుక

ముంబై: తన పుట్టిన రోజు సందర్భంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న సైనికులను వ్యక్తిగతంగా కలుసుకునేందుకు సచిన్ టెండూల్కర్ గతంలో ఒప్పుకున్నాడు. అయితే ఐపీఎల్ షెడ్యూల్ కారణంగా ఇది వీలుపడ లేదు. అందుకే శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారితో మాట్లాడాడు. ‘మీ నుంచి ఎన్నో పాఠాలను నేర్చుకున్నాను. చివరి వరకు మొక్కవోని పట్టుదలతో పోరాడమని మీ జీవితాలు సూచిస్తున్నాయి. ఈసారి వచ్చినపుడు మీతో టేబుల్ టెన్నిస్ ఆడతాను. అలాగే బాస్కెట్ బాల్ నేర్చుకోవాలని ఉంది’ అని వారితో అన్నట్టు సచిన్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాన్ఫరెన్స్ ద్వారానే సచిన్ కేక్‌ను సైతం కట్ చేశాడు. 80కిపైగా సైనికులు పుణేలోని పక్షవాత సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు.