అస్సాం ఎన్నికల్లో ఓటేయని ప్రధాని

అస్సాం ఎన్నికల్లో ఓటేయని ప్రధాని

గువాహటి: అస్సాం శాసనసభ ఎన్నికల్లో ప్రధాని మన్మోహన్‌సింగ్ తన ఓటుహక్కును వినియోగించుకోలేదు. దిస్‌పూర్ నియోజకవర్గంలో ప్రధాని, ఆయన భార్య గురుశరణ్‌కౌర్ ఓటర్లుగా తమ పేర్లు నమోదు చేయించుకున్న సంగతి తెలిసిందే. దిస్‌పూర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని 175 నంబర్ పోలింగ్ బూత్‌లో ప్రధాని సోమవారం తన ఓటును వేయాల్సి ఉంది. ఓటర్ల జాబితాలో ప్రధాని సీరియల్ నెంబరు 721. గత రెండు దశాబ్దాలుగా అస్సాం నుంచి ప్రధాని రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సందర్భంగా దిస్‌పూర్ రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ.. ప్రధాని తన ఓటు హక్కును వినియోగించుకోలేదని చెప్పారు. 2006 శాసనసభ ఎన్నికల్లో ఓటు వేయని ప్రధాని, 2009 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఓటుహక్కును వినియోగించుకున్నారు. ‘మంగళవారం చైనా, కజకిస్థాన్ పర్యటనకు వెళ్లేందుకు ప్రధాని బిజీబిజీగా ఉన్నారు. తీరికలేని పరిస్థితుల వల్లే ఆయన ఓటుహక్కును వినియోగించుకోలేదు‘ అని అధికారవర్గాలు తెలిపాయి.