హజారే బ్యాంకు బ్యాలెన్స్ రూ.68 వేలు

హజారే బ్యాంకు బ్యాలెన్స్ రూ.68 వేలు

న్యూఢిల్లీ: లోక్‌పాల్ బిల్లు కోసం ఏర్పాటైన ముసాయిదా కమిటీలోని అన్నా హజారే సహా ఐదుగురు పౌర సమాజం సభ్యులు శుక్రవారం తమ ఆస్తులను వెల్లడించారు. బిల్లు రూపకల్పన కోసం కమిటీ త్వరలో భేటీకానున్న నేపథ్యంలో పౌర సమాజం సభ్యులు తమ పారదర్శకతను చూపేందుకు ఈ చర్య చేపట్టారు. అయితే వీరిలో హజారే మినహా ఇతర సభ్యుల ఆస్తులు భారీగా ఉండటం గమనార్హం. తన వద్ద రూ. 68,688 బ్యాంకు నిల్వతోపాటు మహారాష్టల్రోని రాలెగావ్ సిద్ధీలో 0.17 ఎకరం, 4.9 ఎకరాలు, పింపియానెర్‌లో 1.13 ఎకరాల భూమి ఉందని హజారే పేర్కొన్నారు.

రాలెగావ్ సిద్ధీలో పొందిన భూమి సైన్యం నుంచి, పింపియానెర్‌లోని భూమి ఓ గ్రామస్తుడి నుంచి విరాళంగా వచ్చిందని, మిగిలిన భూమి కుటుంబం నుంచి అందుకున్నదని చెప్పారు. ఇందులో సైన్యం, గ్రామస్తుడి నుంచి విరాళంగా అందుకున్న భూమిని హజారే తిరిగి గ్రామ అవసరాలకే విరాళంగా ఇవ్వడం విశేషం. కాగా, లోక్‌పాల్ బిల్లు ముసాయిదా కమిటీ సహ చైర్మన్‌గా ఉన్న సీనియర్ న్యాయవాది శాంతిభూషణ్ తన చరాస్తులను రూ. 111 కోట్లుగా చూపారు. అలాగే తనకు ఎనిమిది స్థిరాస్తులు ఉన్నట్లు వివరించారు. గత పదేళ్లలో మొత్తం రూ. 136.71 కోట్ల ఆదాయం ఆర్జించినట్లు ప్రకటించారు.

మరోవైపు శాంతిభూషణ్ కుమారుడు, సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తనకు రూ. 2.2 కోట్ల చరాస్తులు, నాలుగు స్థిరాస్తులు ఉన్నట్లు తెలిపారు. కర్ణాటక లోకాయుక్త జస్టిస్ సంతోష్ హెగ్డే తనకు బెంగళూరులో రూ. కోటిన్నర విలువజేసే భవనం, బ్యాంకు ఖాతాలో రూ. 32 లక్షలు, భార్య పేరిట రూ. లక్షన్నర నగదు ఉన్నట్లు పేర్కొన్నారు. మెగసెసె అవార్డు గ్రహీత అరవింద్ కెజారీవాల్ తనకు రూ. 55 లక్షల విలువజేసే ఫ్లాట్, రూ. 1.35 లక్షల బ్యాంకు నిల్వ ఉందన్నారు.