దిగొచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి : జీవో 177 నిలిపివేత

జీవో 177 నిలిపివేత


హైదరాబాద్‌ : ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేయడాన్ని నిషేధిస్తూ జారీ చేసిన జీవో 177ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జీవో పట్ల పలు అభ్యంతరాలు వచ్చినందున దీనిపై అధ్యయనం చేయడానికి మంత్రివర్గ కమిటీని నియమించినట్లు సర్కారు వెల్లడించింది. ఈ జీవోపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంతో చర్చించారు. ఈ సందర్భంగా కొందరు మంత్రులు జీవో జారీపట్ల అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా తెలంగాణ మంత్రులు శ్రీధర్‌బాబు, కోమట్‌రెడ్డి వెంకట్‌ రెడ్డి జీవోను రద్దు చేయాలని పట్టుబట్టినట్లు తెలిసింది. కనీసం ఉద్యోగ సంఘాలతో మాట మాత్రం కూడా చెప్పకుండా ఎలాంటి చర్చ లేకుండా జీవో జారీ చేయడం సబబు కాదని మంత్రులు అభ్యంతరం చెప్పినట్లు సమాచారం. దీంతో జీవో ను తాత్కాలికంగా నిలిపివేస్తూ అభ్యంతరాలపై అధ్యయం చేయాల్సిందిగా సీఎం మంత్రుల బృందాన్ని ఆదేశించినట్లు తెలిసింది.